ఆంధ్రా కశ్మీర్ లంబసింగిలో స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ జీఎస్‌వీవీఎస్‌ఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో పర్యటించి.. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.
కేంద్రం రూ. 15 కోట్లు, రాష్ట్రం రూ. 20 కోట్లు మంజూరు చేయగా.. తొలి విడతగా రూ. 7.5 కోట్ల నిధులు విడుదలయ్యాయని ప్రసాద్ తెలిపారు. 22 ఎకరాల్లో మ్యూజియం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలో ఏడు ఏకలవ్య ఆదర్శ నివాస అనుబంధ పాఠశాలల నిర్మాణం జరుగుతున్నదని , ఒక్కొక్క పాఠశాలకు రూ.12 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రూ.5 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆశ్రమ పాఠశాలల్లో అదనపు వసతులు కల్పిస్తున్నామన్నారు. పాడేరు డివిజన్‌లో నాడు-నేడు పనులు సంతృప్తికరంగా ఉన్నాయని ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అన్నారు.