ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో విషాదం.. బట్టలు ఉతికేందుకు పెద్దలతో వెళ్లి..! - four Children Missing in Pedderu canal

four Children Missing in Pedderu canal
విశాఖ జిల్లా పెద్దేరులో నలుగురు చిన్నారులు గల్లంతు

By

Published : Jul 26, 2021, 5:07 PM IST

Updated : Jul 27, 2021, 7:53 AM IST

17:01 July 26

ఊబిలో పడి.. ఊపిరాడక.. నలుగురు పిల్లలు మృత్యువాత

చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న తల్లులు
  • నలుగురు పిల్లలు కలిసి రోజంతా ఆటలాడుకున్నారు. చూసినవారికి తెలియలేదు అవి వారి ఆఖరి ఘడియలని...
  • అమ్మల వెంట అడుగులో అడుగేసే్తూ నదికి వెళ్లారు.. ఆ తల్లులకు తెలియలేదు అవి వారి చివరి అడుగులని...
  • అందరూ చూస్తుండగానే నీటిలో అడుగు పెట్టారు.. అక్కడున్న ఎవరికీ తెలియలేదు మిగిలేది కన్నీరేనని...

‘ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాం. పెద్ద చదువులు చదివించాలని ఎంతో ఆశపడ్డాం. మా ఆశలు అడియాశలు చేస్తూ మమ్మల్ని ఒంటరి చేసిపోయాడంటూ’ మహేంద్ర తల్లి రాజేశ్వరి కన్నీరుమున్నీరైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆమె ఒక్కసారిగా కూలబడిపోయింది.

విశాఖ జిల్లా మాడుగుల మండలం జమ్మాదేవిపేట పంచాయతీ శివారు గవరవరంలో సోమవారం నలుగురు బాలలు పెద్దేరులో మునిగి మృత్యువాత పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ కళ్లముందే తమ కంటిపాపలు నీటిలో మునిగిపోవడం చూసిన కన్నతల్లుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. గవరవరం గిరిజన గ్రామం. ఇక్కడ చాలావరకూ వంతాల కుటుంబీకులే ఉన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావడంతో గ్రామంలోని వంతాల వెంకట ఝాన్సీ, వంతాల గౌతమి షర్మిల, వంతాల భవ్య జాహ్నవి, నీలాపు మహేంద్ర మధ్యాహ్నం అందరితో భోజనాలు చేసి ఆటలాడుకున్నారు.

మధ్యాహ్నం సమయంలో ఈ గ్రామానికి చెందిన మహిళలు దుస్తులు ఉతకడానికి పెద్దేరుకు వెళ్తుంటారు. తమ తల్లులు సైతం మధ్యాహ్నం 3 గంటల తరవాత పెద్దేరు రేవుకు బయలుదేరడంతో వారితోపాటే ఝాన్సీ, జాహ్నవి, మహేంద్ర, గౌతమి సరదాగా రేవు వద్దకు వెళ్లారు. పెద్దేరుకు వచ్చే మహిళల వెంట వారి పిల్లలు వస్తుండటం మామూలే. ఎప్పుడూ పిల్లలు నీటిలో దిగేచోటనే పిల్లలు అడుగుపెట్టడం చూసి తల్లులు వారించలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు అక్కడ ఊబి ఏర్పడింది. దానిలో నలుగురూ కూరుకుపోయారు. చిన్నపిల్లలు కావడంతో పైకి రాలేక ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు వదిలేశారు.

క్షణాల వ్యవధిలోనే ఇదంతా జరగడం కళ్లారా చూసిన తల్లులు అచేతనులై ఉండిపోయారు. విషయం తెలపడంతో గ్రామస్థులు పరుగున వచ్చి పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. ఈసారి వర్షాలకు ఊబి ఏర్పడిందనే విషయం ఎవరికీ తెలియకపోవడం తీవ్ర విషాదానికి కారణమైంది.

‘కాయకష్టం చేసైనా కూతురును గొప్పగా చదివిద్దామని అనుకున్నాం. ఇలా అయిందేంటి దేవుడా? మాకెవరు దిక్కు ఏం పాపం చేశామని మాకీ పెద్ద శిక్ష విధించావంటూ’ షర్మిల తల్లి అమ్మాజీ కూతురు మృతదేహాన్ని చూసి బోరుమంది.

‘దేవుడు మాకిచ్చిందే ఒక్క కూతురును. ఇప్పుడూ దానినీ తీసుకెళ్లిపోయాడు. మేం ఏమైపోవాలి? ఎవరి కోసం బతకాలంటూ’ ఝాన్సీ తల్లి రాజకుమారి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.

విప్‌ దిగ్భ్రాంతి

పెద్దేరు నదిలో మునిగి నలుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై విప్‌ బూడి ముత్యాలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక నాయకుల ద్వారా ప్రమాద వార్త తెలుసుకున్న ఆయన ఘటనపై అధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే ఎంపీడీఓ పోలినాయుడు, ఇన్‌ఛార్జి తహసీల్దారు సత్యనారాయణ, ఎస్సై రామారావు సిబ్బందితో వెళ్లారు. పసిపిల్లల మృతదేహాలను ఎక్కడికో తీసుకువెళ్లి పోస్టుమార్టం చేయొద్దని తల్లిదండ్రులు అధికారులను వేడుకున్నారు. దీంతో ఎంపీడీఓ పోలినాయుడు, వైకాపా మండల అధ్యక్షుడు తాళపురెడ్డి రాజారామ్‌ కలిసి ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో ఫోన్‌లో సంప్రదించి వైద్యులను గ్రామానికి పిలిపించారు. ఊబిని పూడ్చేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

స్పందించిన అధికారులు

పెద్దేరు మృత్యుటేరుగా మారిపోయింది. రెండు వారాల కిందటే బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట వద్ద పెద్దేరు దాటుతూ ముగ్గురు వ్యక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవకముందే తాజాగా మాడుగుల మండలంలో మరో నలుగురు బాలలు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:

JAGAN CASE: మరోసారి గడువు కోరిన సీబీఐ.. 'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై విచారణ వాయిదా

Last Updated : Jul 27, 2021, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details