Venkaiah Naidu: ప్రజాస్వామ్యంలో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. లేకుంటే ఎలా ఉంటుందో చూస్తున్నామని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయం వైవీఎస్ ఆడిటోరియంలో మాజీ లోక్ సభాపతి జీఎంసీ బాలయోగి మొదటి ధర్మనిధి ప్రసంగ కార్యక్రమానికి హాజరైన వెంకయ్యనాయుడు.. కొంతమంది నాయకులు కులం, మతం, ధనం, నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధులు అదుపు తప్పితే సమాజం అదుపు తప్పుతుందన్నారు. చట్టసభల జరుగుతున్న తీరు మీద ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రవర్తనా నియామావళి పాటించాలని సూచించారు.
జీఎంసీ బాలయోగి తనతోపాటు ఆంధ్ర విశ్వ విద్యాలయంలో చదువుకున్నారని అన్నారు. ఇక్కడికి రావడమంటే అమ్మమ్మ ఇంటికి వచ్చినట్టు ఉంటుందని తెలిపారు. నేను రాజకీయం నేర్చుకుంది ఇక్కడేనని వెల్లడించారు. బాలయోగి కోనసీమ ప్రాంత అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. ఆయన సామాన్యమైన జీవితాన్ని గడిపారని.. చాలా శాంతంగా ఉండేవారన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలని అన్నారు. అలాగే ఎక్కువమంది మాట్లాడే భాష నేర్చుకోవాలని సూచించారు. ఏ భాషను వ్యతిరేకించకూడదని అన్నారు.