'ఆలయానికి సంబంధంలేని వ్యక్తి రికార్డులను ఎలా పరిశీలిస్తారు? ఆయనకు దేవస్థానం నిధులు ఎందుకు ఖర్చు చేయాలి? దీనిపై వివరణ ఇవ్వండి' అంటూ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఛైర్‌పర్సన్ సంచయితా గజపతిరాజుకు మొన్నటి వరకు ఈవోగా పని చేసిన భ్రమరాంబ లేఖ రాశారు. ఈ నెల ఒకటిన ఆమె బదిలీ కాగా అందుకు రెండు రోజుల ముందు ఆమె ఈ లేఖ రాశారు. ఆ వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ లేఖను దేవాదాయశాఖ మంత్రి, ఆ శాఖ ఉన్నతాధికారులకూ ఆమె పంపారు.
- లేఖలో భ్రమరాంబ ప్రస్తావించిన అంశాలివీ..
‘కార్తీక సుందరరాజన్ సింహాచలం కొండపై 2 ఏసీ గదులతో ఉండే అన్నపూర్ణ కాటేజీలో మే 30 నుంచి ఉంటున్నారు. నిత్యం ఆయనకు అల్పాహారం, భోజనం తదితరాలకు ఆలయ నిధులను వెచ్చిస్తున్నారు. ఛైర్‌పర్సన్ చెప్పారంటూ పరిపాలన, భూ విభాగాల రికార్డులను తెప్పించుకుని ఆయన పరిశీలిస్తున్నారు. ఆలయ భూ పరిరక్షణ విభాగానికి ఉన్న వాహనాన్ని తనకు అవసరం ఉన్నప్పుడల్లా సుందరరాజన్ ఉపయోగించుకుంటున్నారు. వంట తదితర పనులకు అయిదుగురు సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఛైర్‌పర్సన్ ఇంటికి, సుందరరాజన్ ఉండే అతిథి గృహంలో వంట చేసేందుకు కలిపి రెండు గ్యాస్ సిలిండర్లను ఆలయ ఏఈవో సమకూర్చారు’ అని భ్రమరాంబ పేర్కొన్నారు.
- వేధింపులు తట్టుకోలేకపోతున్నా..