రాత్రి సమయంలో విశాఖ నగరానికి చేరుకున్న ప్రయాణికుల భద్రతకు నగర పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన ప్రయాణికులు.. వారి ఇళ్లకు సురక్షితంగా చేరుకునేలా ప్రణాళిక రచించటంతో పాటు వారికి అండగా నిలుస్తున్నారు. ఆపరేషన్ ‘పహారా’ పేరుతో ప్రత్యేక నేర విభాగానికి చెందిన పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
నగర పరిధిలోని జాతీయ రహదారికి ఆనుకుని, సమీపంలో ఉన్న ప్రధానమైన 16 కూడళ్లలో ప్రతీరోజూ రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నేర విభాగానికి చెందిన పోలీసులు పహారా కాస్తున్నారు. కూర్మన్నపాలెం, పాత గాజువాక, ఎన్‌ఏడీ కూడలి, మురళీనగర్, గురుద్వారా, మద్దిలపాలెం(ఆర్టీసీ డిపో), రామాటాకీస్, ఆర్టీసీ కాంప్లెక్సు, హనుమంతవాక, కార్‌షెడ్, ఊశ్వరి కూడలి, తాటిచెట్లపాలెం కూడలి, వేపగుంట, భీమిలి, మారికవలస, వెంకోజీపాలెం.. కూడళ్ల వైపు వచ్చే ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాల రాకపోకలను గమనించటమే కాకుండా నేరస్తుల కదలికలపై దృష్టి సారిస్తున్నారు. ఆయా కూడళ్లలో బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చిన ప్రయాణికులకు ఈ పోలీసు బృందాలు అండగా నిలిచి, వారు ఇళ్లకు చేరుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు.