Rambo Circus: విశాఖ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో గురువారం ప్రారంభమైన రాంబో సర్కస్ ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తోంది. యువ కళాకారుల ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. థ్రిల్ కలిగించే స్టంట్స్ తో పాటు జోకర్ల కామెడీ ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 42 మంది కళాకారులు ఒళ్లు గగుర్పొడిచే ప్రదర్శనలు చేసి ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. ఐదేళ్ల తర్వాత నగరంలో సర్కస్ ఏర్పాటు చేయడంతో.. కళాకారుల విన్యాసాలు తిలకించేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు.
120 నిమిషాల పాటు విన్యాసాలు:ముంబయి, బెంగుళూరు, సూరత్‌లలో అఖండమైన స్పందనతో విజయవంతమైన ప్రదర్శన, ఉత్తమ ప్రపంచ ప్రతిభను ప్రదర్శిస్తూ మొదటిసారిగా ఏపిలోని విశాఖ నగరవాసుల్ని ఆకట్టుకునేందుకు రాంబో సర్కస్ వచ్చేసింది. కష్టతరమైన కోవిడ్ సమయాల్లో రాంబో సర్కస్‌కు తిరుగులేని మద్దతు లభించడం వలన తాము నిలబడగలిగామని నిర్వాహకులు చెబుతున్నారు. తమ తోటి సర్కస్‌లు చాలా వరకు మూతపడవలసి వచ్చినప్పుడు, ప్రజల విశ్వాసమే ప్రజల్ని చేరుకోవడానికి వినూత్న మార్గాలను అన్వేషించేలా చేసిందని ఆన్‌లైన్ సర్కస్ షోలతో, జూమ్, టీమ్‌లు, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రదర్శనలు అందించామన్నారు. రాంబో సర్కస్ 120 నిమిషాల పాటు ఉత్కంఠభరితమైన విన్యాసాలను ప్రదర్శిస్తోంది. రాంబో బృందం స్కేటింగ్, ల్యాడర్ బ్యాలెన్స్, క్యూబ్ జగ్లింగ్, రోల్లా బొల్లా, హులా హూప్ మరియు ఏరియల్ రోప్ వంటి అనేక ఇతర అంశాలతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని అందిస్తున్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు:చిన్నతనం నాటి సర్కస్ ల మాదిరిగా జంతువులు, పక్షులు లేనప్పటికీ వాటిని మైమరపించేలా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు చెబుతున్నారు. సెల్ఫోన్లకు, వీడియో గేమ్స్ కు ప్రాధాన్యమిస్తున్న ఈ తరం చిన్నారులకు ఇటువంటి సర్కస్ లు ఎంతో ఆటవిడుపునిస్తాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.