స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి విశాఖ జిల్లా నర్సీపట్నంలో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. రావికమతం మండలంలోని కొత్తకోట, దొండపూడి, అర్జాపురం తదితర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఓటర్లంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈనెల ఆరో తేదీన నామినేషన్ పత్రాల అభ్యంతరాలు, తిరస్కరణ, 7న తుది నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుందని.. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు ఉంటుందన్నారు. నామపత్రాల అభ్యంతరాలకు సంబంధించి సబ్ కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని ఆమె సూచించారు.
ఎన్నికల ఏర్పాట్లు:
జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాలకు బ్యాలెట్ బాక్సులను తరలించారు. పోలింగ్ సిబ్బందికి కావలిసిన సామాగ్రి ఇప్పటికే మండల కేంద్రాలకు చేరి పోయింది. ఏకగ్రీవాలు కూడా తేలిపోయాయి. విశాఖ జిల్లాలో మొదటి విడత 296 పంచాయతీలకు ఎన్నికలకు సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. 767 మంది బరిలో నిలిచారు. విశాఖలో కలెక్టర్ గా సేవలు అందించిన ప్రవీణ్ కుమార్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పరిశీలన చేస్తున్నారు.
అనకాపల్లి:
రెవెన్యూ డివిజన్ పరిధిలో 12 మండలాల్లో 340 పంచాయితీలకు నోటిఫికేషన్ జారీ చేయగా నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 296 పంచాయతీల్లో ఈ నెల 9న పోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. మండలాల వారీగా బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేసి పోలీసుల పర్యవేక్షణలో గ్రామాలకు పంపిస్తున్నారు. ప్రతి పంచాయతీకి 10 శాతం అదనంగా బ్యాలెట్ పేపర్ పంపిస్తున్నారు.
ఇదీ చదవండి:పల్లె పోరు: ముందు మేము..తరువాత మీరు..!