CID RAIDS AT MARGADARSI : రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, ఏలూరు, రాజమహేంద్రవరం మార్గదర్శి కార్యాలయాల్లో ఐదో రోజూ సీఐడీ అధికారులు తనిఖీలు కొనసాగించారు. కొన్ని చోట్ల తాము ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం వివరాలు ఇవ్వాలని సిబ్బందిపై ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి కొందరు ఖాతాదారులతో మాట్లాడారు. గుంటూరులో సీఐడీ సీఐ సంజీవ్‌కుమార్.. మార్గదర్శి సిబ్బందికి ఫోన్ చేసి తాము అడిగిన సమాచారం ఇవ్వకపోతే కార్యాలయాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. విశాఖ సీతంపేట మార్గదర్శి కార్యాలయంలో సీఐడీ అధికారులు సుమారు 50 నిమిషాల పాటు దస్త్రాలను పరిశీలించారు.
రిమాండ్‌లో ఉన్న బ్రాంచి మేనేజర్ రామకృష్ణను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు... బుధవారం సీతంపేట కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆయనకు కొన్ని పత్రాలను చూపించి పలు అంశాలపై ప్రశ్నించారు. అనంతరం జైలుకు తరలించారు. విశాఖపట్నం సీఐడీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ పలువురు ఖాతాదారులకు ఫోన్లు చేసి వివరాలు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఫోన్ ఎందుకు చేశారని అడిగితే.. మార్గదర్శిపై కొందరు ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. చిట్ కట్టిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చెప్పడంతో.. మీరేమైనా ఇబ్బందులకు గురైతే తెలుసుకుందామని ఫోన్ చేశామని సమాధానమిస్తున్నారు. దాదాపు 21 అంశాలపై ఖాతాదారుల నుంచి వివరాలు ఆరా తీశారు.
మార్గదర్శి మేనేజర్‌కు ముందస్తు మధ్యంతర బెయిల్: గుంటూరు అరండల్‌పేట మార్గదర్శి కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న జి.శివరామకృష్ణకు.. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి ముందస్తు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. శివరామకృష్ణపై పలు అభియోగాలు మోపుతూ అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. ఈ నెల 12న న్యాయమూర్తి ఎదుట హాజరుపరచారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు ఆయనకు వర్తించవంటూ జడ్జి రిమాండ్‌ను తిరస్కరించారు.