ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం - ఉగాది పండగ

ఉగాది సందర్భంగా రాష్ట్రంలో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. కొన్ని గ్రామాలలో అమ్మవార్లు, స్వామివార్లకు కల్యాణం నిర్వహించారు. పెద్ద ఎత్తున జాతరలు చేయగా.. భక్తులు భక్తితో పూజలు చేశారు.

Festive atmosphere across the state
రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం

By

Published : Apr 14, 2021, 10:41 AM IST

ఊంజల సేవ

విశాఖ పోర్టులో ప్రసన్న వేంకటేశ్వరలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు జరిగాయి. ప్రసన్న వేంకటేశ్వరునికి ఊంజల సేవతోపాటు.. సహస్ర దీపారాధన చేశారు. భక్తులు అన్నమాచార్య గీతాలు ఆలపించారు. ఆలయంలో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉగాది రోజున స్వామిని పూజిస్తే ఏడాది పొడవునా గోవిందుడు అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం.

నూకాలమ్మ జాతర

విశాఖ జిల్లా భీమునిపట్నం గ్రామదేవత నూకాలమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు.. నిన్నటితో ముగిశాయి. ఉగాది పర్వదినం కావడంతో వేకువజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ, ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో శానిటైజర్​లు ఏర్పాటు చేశారు.. ఆలయ ప్రధాన అర్చకులు చౌదరి సత్యరావు పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భీమునిపట్నం పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఆలయాలలో భక్తుల రద్దీ

కర్నూలు జిల్లా గూడూరు మండలంలో శ్రీప్లవ నామ సంవత్సరం సందర్భంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటాలాడాయి. తెలుగు సంవత్సరమైన ఉగాది పర్వదినం కావడంతో భక్తులు పూజలు నిర్వహించారు. నాగలాపురం గ్రామంలోని శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి ఆలయం, గూడూరు పట్టణంలోని స్వయంభు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులతో రద్దీగా మారింది. గూడూరు పట్టణంలో పురోహితులు పంచాంగ శ్రవణం చేశారు. భక్తులకు ఉగాది పచ్చడి, ప్రసాదాలు పంచిపెట్టారు

వాళ్లేలాంబ దేవి రథోత్సవం

కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వాళ్లేలాంబ దేవి రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని..పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో జాతర నిర్వహిస్తున్నారు.

యాలి వాహనంపై వీరభద్రస్వామి

కడప జిల్లా రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో.. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద పండితులు సురేందర్ శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. యాలి వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం మార్కెట్ వీధి, గాంధీ బజార్, కంసలవీధి, బ్రాహ్మణ వీధులలో స్వామి అమ్మవారు విహరించారు. మాసాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవారిని అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మంజుల సిబ్బంది స్థానిక, కన్నడ భక్తులు పాల్గొన్నారు.

చౌడేశ్వరి బ్రహ్మోత్సవాలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరీ దేవి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 19 వరకు జరిగే ఉత్సవాలకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మన్ పీఆర్ వెంకటేశ్వర్ రెడ్డి ,ఆలయ ఈవో రామానుజం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పన్నీరు బండ్లను తిప్పి ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారికి గణపతి పూజ కుంకుమార్చనతో పాటు పూజలు చేశారు. ఈనెల 14న భూదేవి శ్రీదేవి సమేత శ్రీచెన్నకేశవ స్వామి కల్యాణోత్సవం ,అమ్మవారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. 15న అమ్మవారి రాయబారం మహోత్సవం, 16న అర్ధరాత్రి ఉత్సవాల్లో ప్రధానమైన అమ్మవారి జ్యోతి ఉత్సవం ప్రారంభిస్తారు .తెల్లవారే వరకు జ్యోతి ఉత్సవం కొనసాగిస్తారు .చెన్నకేశవ స్వామి ఆలయం నుంచి అమ్మవారి ఆలయం వరకు జ్యోతి ఉత్సవం నిర్వహిస్తారు .17న రథోత్సవం, 18న రాయబారం, 19న వసంతోత్సవంతో ఉగాది బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రస్థాయి వృషభ పోటీలను నిర్వహిస్తున్నారు.

సింహాద్రి అప్పన్న పెళ్లి రాట మహోత్సవం

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో పెళ్లిరాట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టుబోర్డు ఛైర్మన్ సంచైత గజపతిరాజు, ఆలయ ఈవో సూర్యకళ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మబ్బులు ఉండడంతో స్వామి పాదాలను కిరణాలు తాకలేదు. గత ఏడాది కోవిడ్ కారణంగా స్వామివారి కల్యాణం ఏకాంతంగా నిర్వహించారు. ఈ ఏడాది 23 న స్వామి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. రాట మహోత్సవం జరగడంతో... నేటి నుంచి ఆలయంలో పెళ్లి పనులు ప్రారంభం అవుతాయి. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గోపాలక్రిష్ణమచార్యులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రకరకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.

వెంకటేశ్వర స్వామికి పుష్పయాగం


నెల్లూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం వేడుకగా జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఓం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని తితిదే కల్యాణ మండపంలో తొలుత స్వామివారి పెళ్లి వైభవంగా నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో పుష్పయాగం చేశారు. గోవింద నామస్మరణల మధ్య స్వామివారి కల్యాణ మహోత్సవం జరిగింది. పుష్పయాగాన్ని తిలకించిన భక్తులు తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు.

లంకాలమ్మ తల్లి జాతర

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉగాది సందర్భంగా అమ్మవారి జాతరను చేశారు. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం మండలం కొమర్రాజు లంకలో లంకాలమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహించారు. రావులపాడు, పొడగట్లపల్లి, ముమ్మిడివర పాడు గ్రామ దేవతల జాతర మహోత్సవాలు జరిగాయి. డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. బ్యాండు మేళాలు, కోలాట నృత్యాలు బాణసంచా కాల్పుల నడుమ అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా సినిమా పాటలకు డ్యాన్సులు వేశారు.

ఇదీ చూడండి.సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన తితిదే

ABOUT THE AUTHOR

...view details