Ferro Alloy Industries are Closing: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి తరలిపోవడంతో.. ఉపాధి అవకాశాల్లేక ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు యువత తరలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమల్ని ఆకర్షించడంతోపాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ఊతమివ్వాల్సిన ప్రభుత్వం.. ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా భరించలేనంత కరెంటు ఛార్జీలు పెంచేయడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 39 ఫెర్రోఅల్లాయ్స్ పరిశ్రమలు మూతపడబోతున్నాయి.
వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు యూనిట్‌కు 4 రూపాయల 95 పైసలుగా ఉన్న కరెంటు ఛార్జీల్ని.. ఈ ప్రభుత్వం 7 రూపాయల 89 పైసలకు పెంచేసింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం టన్నుకు 12 వేల నుంచి 16 వేలకు వరకు పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఉత్పత్తుల డిమాండ్ తగ్గడంతో ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల్లో.. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనే 21 ఉన్నాయి.
వాటిలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 8 మూతపడ్డాయని, జులై 15 నాటికి మిగతా వాటికీ తాళం వేస్తారని ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచడం, మార్కెట్‌లో మెటల్‌కు సరైన ధర లేకపోవడంతో కంపెనీ నిర్వహణ కష్టంగా ఉందని, ఈ నెల 14 నుంచి లేఆఫ్ ప్రకటిస్తున్నట్లు విజయనగరం జిల్లాలోని స్మెల్‌టెక్ కంపెనీ తాజాగా నోటీసుబోర్డు పెట్టింది.
ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ప్రధాన ముడిసరకు విద్యుత్తే. సాధారణంగా ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమల్లో మొత్తం ఉత్పత్తి ఖర్చులో 30 శాతం విద్యుత్‌కే అవుతుంది. ఒక టన్ను ఉత్పత్తికి 4వేల నుంచి 4వేల 500 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఫెర్రో సిలికాన్ వంటి ప్రత్యేక ఉత్పత్తుల్ని చేసే పరిశ్రమల్లో టన్నుకు 8వేల 500 నుంచి 9 వేల యూనిట్ల విద్యుత్ కావాలి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఛార్జీలు నిలకడగా ఉన్నాయి. అయినా తమకు భారమవుతోందని అప్పటి ప్రభుత్వం దృష్టికి తేగా.. 2016 - 17లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున, 2017 - 18లో 75 పైసల చొప్పున రాయితీ ఇచ్చింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నేరుగా కరెంటు ఛార్జీలు పెంచకపోయినా, వివిధ రూపాల్లో బాదుడు మొదలుపెట్టింది. యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచేసింది. ట్రూఅప్, సర్దుబాటు, డిమాండ్ ఛార్జీల పేరుతో మోత మోగించింది. మొత్తంగా 7 రూపాయల 89 పైసల భారం మోపారు. 2023-24లో ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్‌కు రూపాయి 10 పైసల వంతున డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో ప్రస్తుతం 40 పైసల చొప్పున వసూలు చేశాయి. మిగిలిన 70 పైసలు భవిష్యత్తులో ట్రూఅప్‌గా వసూలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపితే యూనిట్‌కు 8 రూపాయల 59 పైసలు అవుతుంది.