విశాఖ మన్యం పాడేరులో 15 రోజుల కిందట రత్నం అనే అటవీశాఖ ఉద్యోగి కరోనాతో మృతిచెందారు. అతని కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించగా.. భార్య, పెద్ద కుమారుడికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. చిన్న కుమారుడు కామేష్కు నెగటివ్ వచ్చింది. బాధితులు ఇద్దరూ కొవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కుమారుడు కామేష్కు పచ్చ కామెర్లు సోకాయి. అతను చికిత్స కూడా తీసుకున్నాడు.
అయితే తండ్రి కరోనాతో దూరం కావడం, అమ్మ, అన్నయ్యలకు అదే వైరస్ సోకటంపై అతను ధైర్యం కోల్పోయాడు. అదే దిగులుతో ఆసుపత్రిలో మంగళవారం సాయంత్రం చికిత్స పొందుతూ అకస్మికంగా మృతిచెందాడు. అతనికి కరోనా పరీక్ష నిర్వహించగా నెగటివ్ వచ్చింది. భర్త, చిన్న కుమారుడు చనిపోవటంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది. అందరితో చలాకీగా ఉండే కుర్రాడు హఠాత్తుగా మృతిచెందటంపై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.