కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం జలాశయం దిగువ బొడ్డేరు నదిపై ఉన్న మర్లగుమ్మి ఆనకట్టకు గండి పడింది. ఆరు వేల ఎకరాలకు సాగునీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఏర్పడింది. ప్రస్తుతం వరిపంట పొట్ట దశలో ఉంది. ఇలాంటి స్థితుల్లో.. సాగునీటికి ఇబ్బందులు వస్తే.. పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందారు.
దీనికి స్పందించిన మర్లగుమ్మి నీటి సంఘం మాజీ అధ్యక్షుడు జొన్నా మహాలక్ష్మినాయుడు ఆధ్వర్యంలో దిబ్బపాలెం, బైలపూడి, జైతవరం, అడవి అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన దాదాపుగా 200 మంది ఆయకట్టు రైతులు సమిష్టిగా కదిలారు. రెండు రోజుల పాటు శ్రమించి.. గండిపడిన మర్లగుమ్మి ఆనకట్టుకు తాటిదుంగలు, పెద్ద దుంగలు అడ్డంగా పెట్టి.. దాదాపుగా ఐదు వేల ఇసుక బస్తాలు వేసి తాత్కాలికంగా పూడ్చారు.