విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం నీటి నిల్వలతో నిండుకుండను తలపిస్తోంది. వర్షాలకు జలాశయంలో భారీగా నీరు వచ్చి చేరింది. నీటిమట్టం గరిష్ట స్థాయిలో ఉండగా... రానున్న రబీ సీజన్‌కు సాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయంలో నీరు సమృద్ధిగా ఉంది. జలాశయాల్లో నీటి నిల్వలు భారీస్థాయిలో ఉండటంతో కళకళలాడుతోంది. జలాశయంలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అదనపు నీటిని బొడ్డేరు నదిలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం నీటిమట్టం గరిష్ట స్థాయి వద్ద నిలకడగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 101.25 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 100.60 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి 130 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు దిగువ సాగునీటి కాలువకు 60 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన స్పీల్ వే గేట్ల నుంచి లీకేజీల రూపంలో బొడ్డేరు నదిలోకి మరో 50 క్యూసెక్కులు వెళ్తుందని జలాశయం ఏఈ రామారావు తెలిపారు.