Farmers Agitation : నిబంధన ప్రకారం ల్యాండ్ పూలింగ్ పరిహారం రైతులకు అందించకుండా.. జగనన్న నిర్మాణాలు ఎలా చేపడుతారని ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండాలానికి చెందిన గంధవరం రైతులు పరిహారం అందించాలని ఆందోళనకు దిగారు. 2019లో పలు సర్వే నంబర్లలోని 19 ఎకరాల డీ పట్టా భూమిని.. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం సేకరించింది.
భూ సేకరణ సమయంలో భయభ్రాంతులకు గురిచేసి మరి భూములు తీసుకున్నారని రైతులు వాపోయారు. నిబంధనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ పరిహారంతో పాటు, పంట నష్టం చెల్లించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపడతారని ప్రశ్నించారు. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న జీడి మామిడి తోటలను పంట చేతికచ్చే సమయంలో నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లముందే లక్షలు విలువ చేసే టేకు చెట్లను కోల్పోయామన్నారు.
స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు ఇచ్చిన ప్రయోజనం లేదన్నారు. పరిహారం కోసం కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగామని.. ఎవరు పట్టించుకోవటం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం అందించాలని కోరారు. జీవానాధారాన్ని కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు. పరిహారం అందించకపోతే జగనన్న నిర్మాణాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.