లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని మామిడి పంటలో అధిక దిగుబడిని సాధిస్తున్నాడు విశాఖ జిల్లా టి.నగర్పాలెంకు చెందిన కొంగర రమేష్ అనే రైతు. ఆరు పదుల వయసులోనూ తానేమీ తక్కువ కాదంటూ యువ శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసురుతున్నాడు. పూత సమయంలో అకాల వర్షాలు, మంచు, పురుగు బెడదలతో పాటు లాక్డౌన్ వల్ల అధిక సంఖ్యలో మామిడి రైతులు దిగుబడి సాధించలేక నష్టపోయారు. అయితే ఈ రైతు మాత్రం 25 ఏళ్ల నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తూ... సుమారు 40 ఎకరాల్లో మామిడి పండ్లను పండిస్తున్నాడు.
'సేంద్రియ ఎరువులతోనే అధిక దిగుబడి' - visakha district mango farmers news
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు రైతులకు నిద్రలేకుండా చేశాయి. వాటికితోడు పలురకాల పురుగుల బెడదలతో అనేక మంది మామిడి రైతులు ఈ ఏడాది దిగుబడి లేక అవస్థలు పడుతున్నారు. కానీ విశాఖ జిల్లాలోని ఓ రైతు మాత్రం వినూత్న పద్దతుల్లో విభిన్న రకాల మామిడి సాగు చేస్తూ... అధిక దిగుబడిని సాధిస్తున్నాడు. సేంద్రియ ఎరువుల వాడకమే పంట దిగుబడికి కారణమని చెబుతున్న ఆ ఆరుపదుల వయసు దాటిన రైతుపై ప్రత్యేక కథనం.
బంగినపల్లి, రసాలు, అమృతం, కొత్తపల్లి కొబ్బరి, హిమామ్ పసంద్, పండూరి తదితర మామిడి పండ్ల జాతులను పెంచుతున్నాడు. 95% సేంద్రియ ఎరువుల ద్వారా మామిడి సాగు చేస్తూ... అధిక దిగుబడిని సాధిస్తున్నాడు. తాను పండిస్తున్న 40 ఎకరాలు మామిడి తోటలో ఏడు ఎకరాల్లో విభిన్న జాతుల మామిడి అధిక దిగుబడికి కారణమని ఆయన చెబుతున్నారు. స్వాగతం అనే మామిడి ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు.
రసాయనిక ఎరువులు వాడి మామిడి సాగు చేస్తే కొన్నిసార్లు అధిక దిగుబడి సాధించవచ్చునని రమేశ్ చెప్పారు. అయితే దీర్ఘకాలంలో అది రైతుకు సహకరించదని అందుకే తాను సేంద్రియ పద్ధతుల్లో మామిడి సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. సహజంగా లభ్యమయ్యే పశువుల పేడ, పశువుల మూత్రం పులియబెట్టిన పలురకాల రసాయనాలతో ప్రత్యేకంగా ఎరువులు తయారు చేసి మామిడి సాగులో వినియోగిస్తున్నట్లు వివరించాడు.