Hyderabad Metro Charges hike: తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అందజేసేందుకు ఫెయిర్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చిన గడువు మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి తపాలా, మెయిల్ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవనున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు మొదలై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తున్న తరుణంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు కేంద్రం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.
విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్ ప్రసాద్ ఛైర్మన్‌గా, కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఐఏఎస్ అధికారి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గత నెలాఖరులో హైదరాబాద్‌లో సమావేశమైన ఈ కమిటీ ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15వ తేదీలోగా తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది.