విశాఖ నగరాన్ని పారిశుద్ధ్యం, అభివృద్ధిలో ముందంజలో నిలిపే దిశగా జిల్లా యంత్రాంగం పటిష్ట ప్రణాళిక రూపొందించింది. స్వచ్ఛతా ర్యాంకులు మొదలు నగర ప్రతిష్టను పెంచే అన్ని అంశాలకు జీవీఎంసీ ప్రాధాన్యతనిస్తోంది. పర్యావరణ హిత బాటలో నగరాన్ని తీర్చిదిద్దడం ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరిచే యోచన చేస్తున్నట్లు చెబుతున్న... జీవీఎంసీ కమిషనర్ సృజనతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ప్ర.భూగర్భ విద్యుత్, 24గంటల మంచినీటి సరఫరా పనులతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇంకా ఎంత కాలం ఈ పనులు కొనసాగుతాయి. ప్రజలకు ఇబ్బందులు తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. ?
జ. మౌలిక సదుపాయాల కల్పన కోసం హుద్ హుద్ ప్రభావం తర్వాత అనేక ప్రాజెక్టులు వచ్చాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కూడా రూ.వెయ్యి కోట్ల వరకు మౌలిక వసతుల కోసం కేటాయింపులు ఉన్నాయి. ఈ పనులతో ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతోంది. కానీ, ఈ పనులు నగర అభివృద్ధి, భవిష్యత్ అవసరాలు, సౌకర్యాల కోసం. ఈపీడీసీఎల్తో సమన్వయం చేసుకుంటూపని చేసే ప్రదేశంలో ప్రత్యేక ప్రమాణాలు పాటిస్తున్నాం. గుత్తేదారులు తాము తవ్విన ప్రదేశం వరకు మాత్రమే పునరుద్ధరణ పనులు చేస్తారు. పూర్తి స్థాయిలో రీ లేయింగ్ పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పనులు చివరకు చేరుకుంటాయి. ఏప్రిల్ నాటికి నగరంలో రహదారులను తవ్వి చేసే పనులు అన్నింటినీ పూర్తి చేసి సాధారణ స్థితి ఏర్పరుస్తాం.
ప్ర.హైదరాబాద్లో వరద ప్రభావం చూస్తున్నాం. గతంలో అనేక నగరాలు ఈ తరహా సమస్యలను చవి చూశాయి. విశాఖలో గెడ్డలు, నాళాల నిర్వహణ ఎలా ఉంది. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు?
జ.జీవీఎంసీ 650చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంది. శివారు ప్రాంతాల్లో జనావాసాలు తక్కువగా ఉంటాయి. ఆ ప్రదేశాల్లో గెడ్డలు వంటివి ఆక్రమణలకు గురవడానికి అవకాశం ఉంది. జీవీఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, గెడ్డలు వంటివి అన్నీ మ్యాపింగ్ చేసి జీఐఎస్ ప్లాట్ ఫాంపై పెడుతున్నాం. ఈ ప్రయత్నం నగరంలోని ఉన్న నీటి వనరుల సంబంధిత సమాచారంపై అధ్యయనంగా ఉపయోగపడుతుంది. నగరంలో చిన్న, పెద్ద 120వరకు చెరువులు ఉన్నాయి. వాటికీ జియో ఫెన్సింగ్ చేయనున్నాం.ఇలా అవసరమైన సంరక్షణ, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాం. గెడ్డలు వంటి వాటిపై ఆక్రమణలు లేకుండా చూసేందుకు ఈప్రయత్నాలు ఉపకరిస్తాయి.
ప్ర. కొవిడ్ మహమ్మారితో మాస్క్ లు, శానిటైజర్ల వినియోగం పెరిగింది. చాలా మంది హోమ్ క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదకర వ్యర్థాల శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఈ విషయాలపై ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలకు ఏం సూచిస్తారు?