ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దామ్రా ఓడరేవు సమీపంలో యస్ తుపాను తీరాన్ని దాటనుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దామ్రా-చాంద్‌బలి మధ్య ఇది భూమిని తాకుతుందని.. భువనేశ్వర్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమాశంకర్ దాస్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందిన 'యస్'తో చాందబలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
రాష్ట్రంలో పొడి వాతావరణం..
యస్ తుపాను కారణంగా రాష్ట్రంలో గురువారం నుంచి 3 రోజుల పాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. బుధవారం వర్షాలు పడే సూచనల్లేవని.. పొడి వాతావరణం నెలకొనే అవకాశముందని స్పష్టం చేసింది.
అంచనాలకు తగ్గట్లుగానే..
శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే 'యస్' తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. ఫలితంగా ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు "ఎరుపు రంగు హెచ్చరిక' జారీ అయింది. 185 కి.మీ వేగంతో గాలులు ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి. మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
మధ్యాహ్నం తీరం దాటనుంది..
యస్ తుపాను దామ్రా పోర్టుకు ఉత్తర దిక్కులో, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ వరకు వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాలుల అల్లకల్లోలం..
విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాం కోట్నం, కృష్ణ పట్నం ఓడరేవులో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక సైతం జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి కొనసాగుతుంది. బుధవారం ఉదయం ఉడా తుపాను ప్రభావం ఉంటుంది.