విశాఖ, విజయనగరం జిల్లాలకు అనుసంధాన మార్గం దేవరాపల్లి-కొత్తవలస రోడ్డు. ఈ రహదారి 24 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గతంలో కొత్తవలస నుంచి కె.కోటపాడు మండలం ఆనందపురం వరకు 14 కిలోమీటర్లు విస్తరణ పూర్తి చేశారు. ఆనందపురం నుంచి దేవరాపల్లి వరకు 10 కిలోమీటర్లు ఉన్న రోడ్డు విస్తరణ చేయకపోవటంతో కొన్నేళ్లుగా ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు.
రెండు జిల్లాలకు చెందిన వందలాది గ్రామాల నుంచి ప్రజలు ఈ మార్గంలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గత ప్రభుత్వం హయాంలోనే ఈ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన అనంతరం రీ టెండరింగ్ పిలిచి.. సిఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.15.40 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో 10 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు పనులు మొదలుపెట్టారు. కొద్దిరోజులుగా ఈ విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి.