Rushikonda: విశాఖలోని రుషికొండపై ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టు పనులపై.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అన్నీ అవాస్తవాలే చెప్పిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఇక్కడ జరుగుతున్న పనులపై స్టే విధించగా దాన్ని ఎత్తివేయించుకునేందుకు తప్పుడు వివరాలు ఇవ్వడం సరికాదన్నారు.
ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రుషికొండ వద్ద తెదేపా పర్యావరణ పరిరక్షణ పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవగా పోలీసులు నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తెల్లవారుజామునే పలువురు ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. రుషికొండ వద్దకు ఎవరూ రానీయకుండా చూశారు. దీంతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని వాహనాలను మళ్లించడంతో అవస్థలు పడాల్సి వచ్చింది.
ఉదయం 10.30 సమయంలో పోలీసుల కళ్లుగప్పి బండారు సత్యనారాయణమూర్తి, భీమిలి, విశాఖ దక్షిణ నియోజకవర్గాల సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, గండి బాబ్జీ, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి రుషికొండ కూడలికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకొని కొండ వద్దకు వెళ్లకుండా నిలువరించారు. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.