డీ-ఫారం భూములకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు వసూలు చేసిన వైకాపా నాయకుడు సహా మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌పురం గ్రామానికి చెందిన గండ్రెడ్డి కాంతమ్మకు.. సర్వే నంబరు 100లో డీ-ఫారం భూమి ఉంది. ఇటీవల గృహనిర్మాణ పథకం కోసం ప్రభుత్వం డీ-ఫారం భూములను సేకరించింది. సుమారు 50 సెంట్ల భూమికి పట్టా లేకపోవడంతో.. ఆమె నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు జిన్నాల జయరాజు, తలారి వెంకట సత్యనారాయణ, తాడి రాంబాబు పట్టా ఇప్పిస్తామని చెప్పి.. రూ.20 లక్షలు వివిధ రూపాల్లో కాంతమ్మ నుంచి వసూలు చేశారు. రోజులు గడుస్తున్నా.. పట్టా రాకపోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంతమ్మ, ఆమె సోదరులు అక్కిరెడ్డి సత్యనారాయణ, అక్కిరెడ్డి పాల్‌తో కలిసి జిన్నాల జయరాజును నిలదీసింది. ఆ సమయంలో జయరాజు కొందరు వ్యక్తులతో కలిసి బాధితులను బెదిరించారు. ఇటీవల పెందుర్తి తహసీల్దారు కార్యాలయంలో అనిశా అధికారులు తనిఖీలు చేయగా.. బాధితురాలి సోదరుడు అక్కిరెడ్డి సత్యనారాయణ అనిశా అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు గురువారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎస్ఆర్పురంలో రౌడీ రాజ్యం నడుపుతూ.. లబ్ధిదారులు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కలెక్టర్ స్పందించి దర్యాప్తు చేయాలని కోరారు.