విశాఖ జిల్లాలో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నా కలెక్టర్ సైతం సరైన శ్రద్ధ చూపడం లేదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. గ్రామాల్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్ వ్యాప్తి చెందాయన్నారు. వైద్య సిబ్బంది గ్రామాలకు రావడం లేదని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోకపోతే చాలా మంది చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం కింద కేంద్రం నిధులు ఇచ్చినా వాటిని మలేరియా శాఖ వాడుకోకపోవడం వల్ల వేరే శాఖకు మళ్లించారని ఆరోపించారు. నాలుగు లక్షల మందికి దోమతెరలు ఇవ్వాలని కేంద్రం సూచిస్తే ప్రభుత్వం 1.86 లక్షల మందికే ఇచ్చిందన్నారు. మిగతావారికి ఇవ్వకపోవడం వల్ల దోమల కారక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో 826 మంది చనిపోయినట్టు ఎన్ఎంఈపీ సర్వేలో నమోదైందని, దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా చూడాలని అయన్న కోరారు.