Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు 10వ ప్లాట్‌ఫాం నుంచి ఈ రైలు పరుగందుకోనుంది. రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుతుందని అంచనా. తొలుత వరంగల్, విజయవాడ, రాజమండ్రిలో మాత్రమే ఆగుతుందని అనుకున్నా ఖమ్మంలోనూ ఆపాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర వాసుల అవసరాలు తీర్చేలా:హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు జిల్లాలకు వెళ్లాలంటే.. రైళ్లలో ఎప్పుడూ బెర్తులు దొరకని పరిస్థితి ఉంటుంది. 4 నెలల ముందు బెర్తుల రిజర్వేషన్ ప్రారంభమైనా కొద్ది రోజులకే రైళ్లు నిండిపోతుంటాయి. రోజూ ప్రయాణించే 9 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తోడు.. వారంలో 1, 2, 3 రోజులు నడిచే ప్రత్యేక రైళ్లున్నా, అన్నింటిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడంత కన్పిస్తుంటుంది. ఈ తరుణంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రావడాన్ని నగర ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.
వారంలో 6 రోజులే.. ఆదివారం నడవదు:ప్రారంభ రోజు మినహా..మిగతా రోజుల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు వందేభారత్ రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి 11.25 గంటల సమయంలో విశాఖపట్నం చేరుతుందని ప్రాథమికంగా అందిన సమాచారం. వారంలో 6 రోజులే నడుస్తుంది. ఆదివారం నడవదని షెడ్యూలులో వెల్లడించారని వరంగల్ రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ స్వామి తెలిపారు.