విశాఖ జిల్లాలో మన్యం పెదబయలు మండలం లాగబూసిలో ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అనంతరం అత్యధికంగా 740 లీటర్ల మేర నాటుసారా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. పట్టుబడిన నాటుసారా పాడేరు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.
ఏం చేస్తున్నారో..
దాడుల్లో పట్టుబడిన నాటుసారాను అధికారులు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. రాత్రులు సాధారణమైన వాచ్మెన్ ఉన్నప్పటికీ పాడేరు ఎక్సైజ్ కార్యాలయంలో పెద్దగా రక్షణేదీ లేదు. మూడు వైపుల గోడల పై నుంచి చోరులు ప్రవేశించి నాటు సారా ఎత్తుకెళ్లే అవకాశం ఉంది.
పరిశీలనకు ఉదయమే..
ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈటీవీ- ఈటీవీ భారత్ ప్రతినిధి ఆబ్కారీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు, స్వాధీనం చేసుకున్న సారా మూటలు ఓ వాహనంలో ఎదురుగా ఉన్నాయి. ఈ క్రమంలో అధికారుల పనితీరు పరిశీలనలో భాగంగా ఈటీవీ ప్రతినిధి పది లీటర్ల సారా ప్యాకెట్ మూటలను వాహనం నుంచి కిందకు దించారు. అనంతరం ప్రధాన రహదారి వద్దకు తీసుకెళ్తున్నా అడిగే నాథుడే లేరు. అరగంట వరకు కార్యాలయంలోనే ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ కనిపించకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడతోంది.