Home Decoration Tips : మనం ఎక్కువ సమయం గడిపేది, అతిథులొచ్చినా కూర్చునేది లివింగ్ రూమ్‌లోనే. కాబట్టి అక్కడ స్థలాన్ని బట్టి ఓ చక్కటి సోఫాసెట్‌ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక బడ్జెట్ గురించి ఆలోచించే వారైతే కేన్, చెక్కతో తయారుచేసినవి అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయి. ఇక లివింగ్ రూమ్ కాస్త పెద్దగా ఉన్న వారు.. అక్కడక్కడా సైడ్ ఛైర్స్ ఏర్పాటు చేస్తే.. ఎక్కువ మంది అతిథులొచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడచ్చు.
⚜ ఇంటికి కావాల్సిన అత్యవసర వస్తువుల్లో డైనింగ్ టేబుల్ ఒకటి. ఇది ఇంటికి కొత్త కళనూ తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరి అవసరాలకు అనుగుణంగా.. ఇద్దరు, నలుగురు, ఆరుగురు.. కూర్చొనే డైనింగ్ టేబుల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు.. ఇరువైపులా/నాలుగువైపులా కుర్చీలుండి.. మరోవైపు బెంచ్ తరహాలో ఉండేవి కూడా రూపొందుతున్నాయి. ఇవేవీ వద్దనుకున్న వారు.. ఇంట్లో స్థలాన్ని ఆదా చేసుకోవాలనుకునే వారు.. గోడకు ఫోల్డింగ్ తరహాలో ఉండేలా ఓ వాల్‌మౌంటెడ్ చెక్కను ఫిట్ చేయించుకొని.. ఇరువైపులా రెండు కుర్చీలూ వేసుకోవచ్చు.. అవసరం లేనప్పుడు ఆ చెక్కను ఫోల్డ్ చేసుకోవచ్చు.
⚜ ప్రస్తుతం చాలామంది ఇంటీరియర్స్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఈ క్రమంలో డ్రస్సింగ్ టేబుల్ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. దీనికి బదులు ఇంట్లోనే తమకు అనువైన చోట ఓ మిర్రర్ ఏర్పాటుచేయించుకొని.. దానికి కింది భాగంలో వాల్ మౌంటెడ్ ర్యాక్‌ని ఏర్పాటుచేసుకొనే వారూ లేకపోలేదు. దీనివల్ల బడ్జెట్ కూడా ఆదా అవుతుంది. అంతేకాదు.. ఇల్లు మారేటప్పుడు సులభంగానూ ఉంటుంది.