తొలి విడత ఎన్నికలు నిర్వహించనున్న పంచాయతీలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. విశాఖ జిల్లాకు సంబంధించి అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో అనకాపల్లి, ఎలమంచిలి, అచ్చుతాపురం, మునగపాక, బుచ్చయ్యపేట, చోడవరం, కే కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల మండలాల్లోని 340 పంచాయతీలు సర్పంచ్ 3250 వార్డులలో వార్డు సభ్యులకు మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. నామినేషన్ల స్వీకరణకు రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించి ఈనెల 28న విశాఖ నగరంలో అవసరమైన శిక్షణ ఇచ్చారు. వీరంతా శుక్రవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన వివరాలను స్వీకరిస్తారు. వచ్చేనెల ఒకటో తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది.
తిరస్కరించిన నామినేషన్లపై సంబంధిత డిప్యూటీ జిల్లా ఎన్నికల అథారిటీకి వచ్చే నెల 2న అప్పీలు చేసుకోవచ్చు. అప్పీలును మరుసటి రోజు సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. వచ్చే నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ సమయం ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తారు. వచ్చే నెల 9వ తేదీ ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాలు ప్రకటిస్తారు. అదేరోజు ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తారు.