సాగులో రైతులు నష్టపోకుండా 100 శాతం ఆర్థిక భరోసా కల్పించేందుకు ఏటా ఈ క్రాప్ విధానం చేపడుతున్నారు. ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా వ్యవసాయ, రెవెన్యూ శాఖలో ఉమ్మడి అజమాయిషీ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత ఇందులో ఈ కర్షక్ యాప్‌లోని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈ విషయంపై.. అధికారులు దృష్టి సారించి ఇబ్బందులను తొలగించినా నమోదు మందకొడిగానే సాగింది.
అయితే ఇటీవల జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మండలాల్లో పర్యటించి నమోదు తీరుని పర్యవేక్షించారు. నెలాఖరులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. నర్సీపట్నం వ్యవసాయ సహాయ కార్యాలయం పరిధిలో నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగులలో మొత్తం 40 వేల ఎకరాల ఉద్యానవన పంటలను నమోదు చేసే ప్రక్రియను చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఉద్యానవన పంటల పరిస్థితిని అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.