విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ఆందోళన నిర్వహించారు. మహిళా గ్రూపు సభ్యులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వైయస్సార్ ఆసరా పథకం జమ కాలేదంటూ నిరసన చేపట్టారు.
దీనిపై ఇప్పటికే అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేదని ఆరోపించారు. అందుకే ఆందోళన చేపట్టామని జనసేన నేతలు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని అన్నారు. వీటిని అమలుచేయడంలో ఆయా వాలంటీర్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళా గ్రూపు సభ్యులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టరుకు వినతిపత్రం అందించారు.