విశాఖ మహా నగరంలో విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.... విద్యుత్ సరఫరాను పెంచేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ-ఈపీడీసీఎల్ సిద్ధమైంది. ప్రతి ఉపకేంద్రం సామర్థ్యంలో... 50శాతం లోడ్‌ను మాత్రమే వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. ఒక విద్యుత్ సబ్ స్టేషన్‌పై పూర్తి లోడ్ భారం పడకుండా.... విశాఖలో సబ్ స్టేషన్లను తీసుకురానుంది. 10 వేల కోట్ల రూపాయల అంచనాలతో కేంద్ర, రాష్ట్ర విద్యుత్ శాఖలకు ప్రతిపాదనలు పంపింది.
వచ్చే 30ఏళ్లలో విశాఖ చుట్టుపక్కల పారిశ్రామిక అవసరాలు, గృహవినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్ ప్రత్యేక సర్వే నిర్వహించింది. వచ్చే పదేళ్లలో రోజుకు 25మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరమయ్యే స్థాయికి విశాఖ నగరం చేరుకుంటుందని అంచనా వేసింది. నగరంలో ఇప్పుడున్న విద్యుత్తు వినియోగం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. తక్కువ సరఫరాతో వచ్చే విద్యుత్తు నష్టాలను అధికారులు అంచనా వేశారు. ఆ నష్టాన్ని అరికట్టేలా, సరఫరా వనరులను పెంచుకునేలా కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారుల సూచన మేరకు 10వేల కోట్ల రూపాయల అంచనాలతో విద్యుత్తు శాఖకు ప్రతిపాదనలు పంపారు.
విశాఖ నగరం భవిష్యత్తు అవసరాలను తీర్చేలా 5 భారీ సబ్‌స్టేషన్లను ప్రతిపాదించగా.. వాటన్నింటినీ ట్రాన్స్‌కో ద్వారా మంజూరు చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 820కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది. వచ్చే 50ఏళ్ల అవసరాలకోసం విస్తరించుకునేలా ఈ సబ్‌స్టేషన్లను డిజైన్ చేశారు. కంచరపాలెంలో 2 ఎకరాల్లో అధునాతన 220/132/33KV బహుళార్థక సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి.
" కంచరపాలెంలో 2 ఎకరాల్లో అధునాతన 220/132/33KV బహుళార్థక సబ్‌స్టేషన్‌ను నిర్మించేందుకు అనుమతులు వచ్చాయి. NSPL, ఎండాడ దగ్గర రెండు సబ్ స్టేషన్లు అడిగాము. వాటికి కూడా అనుమతులు రానున్నాయి. కంపెనీ మొత్తంలో25సంవత్సరాల వరకూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికలు చేస్తున్నాం. " -సంతోషరావు, సీఎండీ ఈపీడీసీఎల్