విశాఖ కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ ప్రత్యేక అధికారి, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్ధ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల... పీపీఈ కిట్లు ధరించి కొవిడ్ చికిత్స పొందుతున్న రోగులను కలిశారు. చికిత్స, మందులు, సదుపాయాలపై ఆరా తీశారు. కేసు షీట్లు పరిశీలించారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకున్నారు. పేషెంట్లకు ధైర్యం చెప్పి.. వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకోవాలని సూచించారు. బాధితులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందికి చెప్పారు.
భోజనం బాగుందని కొవిడ్ బాధితులు చెప్పడంపై సంతృప్తి చెందారు. షిఫ్టు డ్యూటీ సహాయ ప్రొఫెసర్ విధులకు హాజరు కాలేదని ఆగ్రహించారు. శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ డా.మైథిలిని ఆదేశించారు. డ్యూటీ వైద్యులు, స్టాఫ్ నర్స్ లు సక్రమంగా విధులు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శానిటేషన్ చేయాలని చెప్పారు. సూపర్ స్పెషలిటీ వార్డుల్లో మరుగుదొడ్లు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ ఎన్ వోలు,ఎం ఎన్ వోలు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.