ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RUSHIKONDA: రుషికొండ చుట్టూ అనుమానాలే.. - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

RUSHIKONDA: విశాఖలోని రుషికొండ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) హైకోర్టులో ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన కొన్ని అంశాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనూ పనులు విస్తుగొలిపేలా ఉన్నాయి.

RUSHIKONDA
RUSHIKONDA

By

Published : Jul 19, 2022, 3:03 PM IST

RUSHIKONDA: విశాఖలోని రుషికొండ పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) హైకోర్టులో ఇటీవల అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో తెలిపిన కొన్ని అంశాలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలోనూ పనులు విస్తుగొలిపేలా ఉన్నాయి. ఏపీ కోస్టల్‌ జోన్‌ నిర్వహణ సంస్థ నిబంధనల ప్రకారం అధికారులు నిర్మాణ పనులకు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా ఇప్పటివరకు తీసుకోలేదు.

అంశం: బృహత్తర ప్రణాళిక అమలు

కోర్టుకు తెలిపింది:విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) బృహత్తర ప్రణాళిక నిబంధనల ప్రకారం అనుమతి తీసుకున్నాం. కొత్తగా వచ్చిన 2041 ప్రణాళికలో ప్రాజెక్టు బహుళ వినియోగ ప్రాంతంగా ఉంది.

వాస్తవ పరిస్థితి:రుషికొండవద్ద పర్యాటక ప్రాజెక్టు పనులను ప్రారంభించే సరికి కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రాలేదు. అయినా కొత్త ప్లాన్‌ ప్రకారం అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. కొత్త ప్లాన్‌ గెజిట్‌ గత ఏడాది నవంబరులో వచ్చింది. అప్పటికే ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. అమల్లోకి రాని ప్లాన్‌తో తీరప్రాంత క్రమబద్ధీకరణ జోన్‌ (సీఆర్‌జడ్‌) అనుమతులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు ఎలా దరఖాస్తు చేశారన్నది కొందరి ప్రశ్న.

అంశం: ప్రాజెక్టు స్వరూపం

కోర్టుకు తెలిపింది:గతంలో ఉన్న రిసార్టు పాతది కావడంతో విలాసవంతమైన సౌకర్యాలు, పర్యాటకులకు గొప్ప అనుభూతి అందించే వసతులతో ప్రాజెక్టు చేపడుతున్నాం. 9.88 ఎకరాల్లో 7 బ్లాకులు నిర్మిస్తాం. 5.18 ఎకరాల్లో నిర్మాణాలు, మిగిలినచోట గ్రీన్‌బెల్ట్‌ ఉంటుంది. 5.18 ఎకరాల్లోని 2.71 ఎకరాల్లో పూర్తి స్థాయి కాంక్రీటు నిర్మాణాలు వస్తాయి. ఈ ఏడాది నవంబరుకు పూర్తి చేస్తాం.

వాస్తవ పరిస్థితి:9.88 ఎకరాల్లో ప్రాజెక్టు చేపడుతున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో దానికి రెండింతల విధ్వంసం జరిగినట్లు కనిపిస్తోంది. కొండ చుట్టూ తవ్వేశారు. సుప్రీంకోర్టు పాత నిర్మాణాలున్న ప్రాంతంలో పనులు చేయాలని ఆదేశించగా అందుకు విరుద్ధంగా గతంలో నిర్మాణాలు లేనిచోటా పనులు మొదలుపెట్టారు.

అంశం: సీఆర్‌జడ్‌ నిబంధనలు

కోర్టుకు తెలిపింది:చెన్నైకి చెందిన అన్నా విశ్వవిద్యాలయానికి చెందిన ఐఆర్‌ఎస్‌ సర్వే ప్రకారం రుషికొండ ప్రాజెక్టు ప్రాంతం సీఆర్‌జడ్‌-2లో ఉంది.

వాస్తవ పరిస్థితి:రుషికొండ సీఆర్‌జడ్‌-2లో ఉన్నా.. ఈ ప్రాజెక్టు ప్రారంభించేసరికి వీఎంఆర్‌డీఏ కొత్త మాస్టర్‌ప్లాన్‌ అమల్లోకి రాలేదు. 2021 ప్రణాళిక ప్రకారం ఇది కన్జర్వేషన్‌ జోన్‌లో ఉంది. కొత్త ప్లాన్‌లో ఈ ప్రాంత భూ వినియోగాన్ని బహుళ వినియోగ స్థలం పరిధిలోకి తెచ్చారు. రుషికొండ ప్రాజెక్టు కోసమే భూవినియోగాన్ని మార్చినట్లు అనుమానించాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఈ వివరాలతో ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ మ్యాపులను మార్చి సీఆర్‌జడ్‌ అనుమతులకు వెళ్లారని సమాచారం.

అంశం: కార్మికుల వసతి, సామగ్రి నిల్వ

కోర్టుకు తెలిపింది:ప్రాజెక్టు పరిసరాల్లో ఎక్కడా లేబర్‌ క్యాంపు పెట్టలేదు. ఎక్కడా భవన నిర్మాణ సామగ్రి ఉంచలేదు.

వాస్తవం: ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆనుకొని భారీ లేబర్‌క్యాంపుఉంది. కార్మికులు ఉండేందుకు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. భవన నిర్మాణ సామగ్రి యంత్రాలు, లారీలను అక్కడే ఉంచుతున్నారు.

అంశం: భూగర్భ జల వినియోగం

కోర్టుకు తెలిపింది:ప్రాజెక్టు పనులకు భూగర్భ నీటిని వినియోగించడం లేదు.

వాస్తవం:ప్రాజెక్టు అవసరాలకు దాని సమీపంలో గతంలో ఉన్న బోరుకు కుళాయి అమర్చి భూగర్భ జలాలను తోడేస్తున్నారు.

అంశం: తవ్వకం పనులకు అనుమతి

కోర్టుకు తెలిపింది:గనులశాఖ నిబంధనల ప్రకారం తవ్వాం.

వాస్తవం: అనుమతి తీసుకున్న దానికన్నా అధిక మొత్తంలో తవ్వినట్లు కనిపిస్తోంది.

అంశం: గ్రావెల్‌ డంప్‌

కోర్టుకు తెలిపింది:కొండ తవ్వడం ద్వారా వచ్చిన గ్రావెల్‌ను జల వనరుల పక్కన పడేయలేదు. అక్కడి మట్టిని తిరిగి అక్కడే వినియోగించేలా ఉంచాం. మరికొంత అనుమతి తీసుకున్న ప్రాంతంలో నిల్వ చేశాం.

వాస్తవం:కొండ తవ్వడంవల్ల వచ్చిన గ్రావెల్‌ను మొదట్లో బీచ్‌ రోడ్డులో మంగమారిపేట, తొట్లకొండ ఎదురుగా, ఎర్రమట్టి దిబ్బలు ఎదురుగా ఉన్న ప్రాంతాల్లోని సముద్రానికి సమీపంలో రోడ్డు పక్కన డంప్‌ చేశారు. మంగమారిపేటవద్ద అలలు ఒక్కోసారి డంప్‌ చేసిన గ్రావెల్‌ను తాకుతున్నాయి. అనంతరం కలెక్టరు నుంచి అనుమతి తీసుకొని కాపులుప్పాడలో నిల్వ చేశారు. ఆపై తీరం పక్కన వేసిన ప్రాంతాలకు అనుమతి తీసుకున్నట్లు చూపించారు. ఏపీ కోస్టల్‌ జోన్‌ నిర్వహణ సంస్థ 22.3.21న జల వనరులకు సమీపంలో గ్రావెల్‌ డంప్‌ చేయకూడదని పేర్కొంది. 19.4.21న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇచ్చిన సీఆర్‌జడ్‌ నిబంధనలో ఈ అంశాన్ని స్పష్టంగా తెలిపింది. అయినా పట్టించుకోకుండా 20.12.21న తీరం పక్కనే ఉన్న ప్రదేశాల్లో గ్రావెల్‌ వేయడానికి ఎలా అనుమతిచ్చారని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details