విశాఖ జిల్లా సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి పవర్‌కెనాల్ వద్ద నిపుణుల సలహా మేరకు రూ.61 లక్షల అంచనా వ్యయంతో రక్షణగోడను నిర్మించడానికి ఏపీ జెన్‌కో అధికారులు టెండర్లు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టు 12న డొంకరాయి పవర్‌కెనాల్‌కు గండిపడింది. సుమారు 2 నెలల పాటు మరమ్మతులు చేసి అక్టోబరు 16న నీరు విడుదల చేశారు. ఈ క్రమంలో స్థానిక వనదుర్గ ఆలయం వద్దనున్న అక్విడెక్ట్ వింగ్‌వాల్ బీటలు వారింది. ఈ విషయం గుర్తించిన సిబ్బంది విద్యుదుత్పత్తిని నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. వింగ్‌వాల్ నుంచి మట్టి జారకుండా రాయి పేర్చి బీటలు పడ్డ ప్రదేశంలో కెమికల్ ట్రీట్‌మెంట్ చేశారు.
భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకుగాను ఇంజినీరింగ్ నిపుణులు, ఐఐటీ నిపుణుల సలహా మేరకు వింగ్‌వాల్‌ను పటిష్టపరచడానికి రక్షణగోడ నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించారు. దీనికి యుద్ధప్రాతిపదికన అంచనాలు తయారుచేసి ఇటీవల జెన్‌కో అధికారులు టెండర్లు నిర్వహించారు. వింగ్‌వాల్ వద్ద సుమారు 44 మీటర్ల పొడవు, 12.5 మీటర్ల ఎత్తులో రక్షణగోడ నిర్మించడానికి రూ. 61 లక్షలు అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు చెందిన గుత్తేదారు ఈ టెండరును గెలుచుకున్నారు. టెండర్లకు సంబంధించిన మిగతా ప్రక్రియ పూర్తిచేసి వచ్చే వారంలోగా పనులను ప్రారంభించడానికి జెన్‌కో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.