విశాఖ మారుమూల కొండల్లో ఆదివాసీ గిరిజనులు రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అందుబాటులో లేక డోలీలో నిండు గర్భిణిని మోసుకువెళ్తుండగా మార్గంలో ప్రసవమై.. శిశువు కన్నుమూసిన ఘటన మన్యంలో జరిగింది.
చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీలో మారుమూలనున్న కరకపల్లి గ్రామానికి చెందిన నిండు గర్భిణి కొర్రా దేవిని గ్రామస్థులు ఆసుపత్రికి చేర్చేలోపే ప్రసవమైంది. ఆడబిడ్డకు జన్మనిచ్చినా.. పుట్టిన వెంటనే శిశువు మరణించింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కరకపల్లికి చెందిన కొర్రా దేవికి నలుగురు పిల్లలు. ఐదో కాన్పులో పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. రహదారి, రవాణా సదుపాయం లేకపోవడంతో పల్లకిలో ఐదు కిలోమీటర్ల దూరం మోసుకువచ్చారు. మార్గమధ్యంలో నొప్పులు అధికమై ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆడబిడ్డ మరణించింది. దీంతో కుటుంబ సభ్యులు రోదిస్తూ ఇంటిముఖం పట్టారు.