ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Winter Allergies: అసలే చలి కాలం.. ఆపై అలర్జీల దాడి

Winter Allergies: తుపాను ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి తీవ్రత పెరిగింది. తద్వారా శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇదే కోవలో అలర్జీల బారినపడే వారు ఆసుపత్రిల్లో చేరుతున్నారు.

By

Published : Dec 11, 2022, 10:49 AM IST

Published : Dec 11, 2022, 10:49 AM IST

allergie
అలర్జీ

Winter Allergies: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రోజంతా మబ్బుపట్టి.. సన్నని గాలులతో చలి గజగజలాడిస్తోంది. ఉష్ణోగ్రత 14 నుంచి 16 డిగ్రీల లోపే ఉంటోంది. ఉదయం 8-9 గంటలు దాటినా చలి తగ్గడం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఆస్తమా.. సీవోపీడీ తదితర శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ చలి మరింత ఇబ్బంది పెడుతుంది. ఎక్కువగా అలర్జీలు దాడి చేస్తున్నాయి.

వారం రోజులుగా ఆసుపత్రులకు వచ్చే వారిలో 15 శాతం మంది వరకు అలెర్జిక్‌ రైనైటీస్‌తో బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి ఒక్కసారిగా ఓపీ తాకిడి పెరిగింది. నిత్యం వేయి మందిపైనే వివిధ రకాల అలర్జీలు, ఈఎన్‌టీ సమస్యలతో వస్తున్నారు. సైనస్‌ సమస్యలతో చాలామంది రోగులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఎక్కువ మందిలో జలుబు, పొడి దగ్గు, ముక్కు కారటం, వరుసగా తుమ్ములు, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లల్లో దురద తదితర లక్షణాలు ఉంటున్నాయి.

దీనినే అలెర్జిక్‌ రైనైటీస్‌గా భావించాలని వైద్యులు పేర్కొంటున్నారు. ఛాతిలో బరువు, ఆయాసం, జ్వరం, పిల్లి కూతలు లాంటి లక్షణాలు ఉంటే ఆస్తమాగా భావించి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ కాలంలో ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దుమ్ము ధూళిని శుభ్రం చేసేటప్పుడు, బాత్‌రూంలో వాడే రసాయనాలు, అగర్‌బత్తీల పొగ పీల్చకుండా మాస్క్‌ ధరించడం వల్ల అలర్జీల బారిన పడకుండా చూసుకోవచ్చు. సైనస్‌, ఆస్తమా సమస్యలు ఎదుర్కొంటున్న వారు బాగా పుల్లగా ఉన్న పండ్లు తింటే సమస్య మరింత పెరుగుతుంది.

తస్మాత్‌ జాగ్రత్త: డాక్టర్‌ రమణప్రసాద్‌, సీనియర్‌ పల్మనాలజిస్టు

* ఈ సీజన్‌లో ఆస్తమా, సీవోపీడీ లాంటి సమస్యల వల్ల శ్వాస ఆడకపోవడం ఇతర ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా డస్ట్‌మైట్స్‌, పుప్పొడి, పెంపుడు జంతువులు, ఫంగస్‌ వంటి ఇండోర్‌ అలర్జీలు ఆస్తమా సమస్యలను ప్రేరేపిస్తాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.
* అధిక చలిలో ముక్కు, చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వాళ్లు ఎండ వచ్చిన తర్వాత చేయడం మంచిది. చెవిలో నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఈఎన్‌టీ నిపుణులకు చూపించాలి.
* చల్లని గాలి, పొడి వాతావరణం వల్ల గాలిలో తేమ తగ్గడం వల్ల పెదవులు, ముఖం, చర్మం పొడి బారుతుంటాయి. దురద వల్ల గోకితే పుండ్లు పడతాయి. కొబ్బరి నూనె ఇతర మాయిశ్చరైజర్లతో చర్మం పొడిబారిపోకుండా చూసుకోవాలి.
* చలికాలంలో చాలామంది నీళ్లు తాగడం మానేస్తుంటారు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్లకు ఇది దారి తీస్తుంది. దాహం లేకపోయినా 7-8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఫలితంగా చర్మం కూడా మృదువుగా ఉంటుంది.
* ముఖ్యంగా ఛాతి పట్టేసినట్లు ఉండటం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం రెండు, మూడు రోజుల కంటే ఎక్కువగా ఉంటే న్యుమోనియా కింద భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో చలికాలంలో అప్రమత్తంగా ఉండాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details