ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో(andhra-orissa border) మావోయిస్టుల కదలికల గురించి.. విశాఖ రేంజి డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ఆరా తీశారు. విశాఖ మన్యం, మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన గూడెంకొత్తవీధి మండలంలోని పలు ప్రాంతాల్లో డీఐజీ ఆకస్మికంగా పర్యటించారు. ఇటీవల కాలంలో ఏవోబీలో జరిగిన కీలక పరిణామాలు, మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్‌కే మరణానంతరం.. మావోయిస్టు పార్టీ కదలికల గురించి చింతపల్లి ఏఎస్పీ, సీఐ, ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలీసుస్టేషన్‌లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, మావోయిస్టు కదలికల గురించి ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని.. డీఐజీ, పోలీసు అధికారులను అదేశించారు. ఈ సందర్బంగా స్టేషన్ల భద్రత నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమీక్షించారు.
మన్యంలో గంజాయి సాగు, రవాణా కట్టడికి ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు.. రంగారావు తెలిపారు. గంజాయి ఎక్కువగా పండిస్తున్న ప్రాంతాలు, వాటి రవాణా మార్గాలపై అధికారులతో చర్చించారు. గూడెంకొత్తవీధి సర్కిల్, ఎస్సై కార్యాలయాలను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులపై సీఐ అశోక్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గంజాయి వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని డీఐజీ అన్నారు. ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో గంజాయి నియంత్రణకు ప్రయత్నించాలని చెప్పారు.