ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Simhadri Appanna: వీఐపీల సేవలో అధికారులు.. సామాన్య భక్తులకు దక్కని దర్శన భాగ్యం - Sri Varahalakshmi Narasimha temple

Chandanotsavam: అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం తిలకించే భాగ్యం సామాన్య భక్తులకు దక్కలేదు. నిబంధనలకు విరుద్ధంగా లెక్కకు మించి ప్రొటోకాల్‌, వీఐపీ దర్శన టిక్కెట్ల జారీతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసిన సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. ఆలయానికి శాశ్వత ఈవోలేకపోవడం.. రాజకీయ పెత్తనం పెరిగిపోవడంతో ముందస్తు ఏర్పాట్ల నిర్వహణలో దేవదాయశాఖ పూర్తిగా విఫలమైంది.

Simhadri Appanna Chandanotsavam
సింహాద్రి అప్పన్న చందనోత్సవం

By

Published : Apr 24, 2023, 7:28 AM IST

Simhadri Appanna: వైఐపీల సేవలో అధికారులు.. సామాన్య భక్తులకు దక్కని దర్శన భాగ్యం

Simhadri Appanna Chandanotsavam: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సింహాచలం సింహాద్రి అప్పన్న నిజస్వరూప దర్శనానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే గాక.. ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిసినా ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్య అడుగడునా కనిపించింది. రాజకీయ సిఫార్సులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి అనుయాయుల ప్రొటోకాల్, వీఐపీల దర్శనాలకు ప్రాధాన్యమిచ్చారేగానీ, సాధారణ భక్తుల గోడే పట్టించుకోలేదు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అప్పన్న ఆలయంపై అధికార పార్టీ రాజకీయ పెత్తనం ఎక్కువైంది. అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజును కక్ష సాధింపుతో తొలగించడం మొదలుకొని.. ఈవోల నియామకం, ఇతర కార్యక్రమాల నిర్వహణలోనూ ఇదే వైఖరి కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండుసార్లు మాత్రమే చందనోత్సవం జరగ్గా.. ఈ రెండుసార్లూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

అప్పన్న ఆలయానికి శాశ్వత ఈవో లేకపోవడం వల్లే తరుచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సింహాచలం ఆలయానికి 4 ఏళ్లలలో ఆరుగురు ఈవోలు మారారు. 9 నెలలుగా ద్వారకా తిరుమల ఆలయ ఈవో త్రినాథరావుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. సింహాచలం నుంచి ద్వారకా తిరుమలకు 290 కి.మీ. దూరం ఉంది. రెండు ప్రధాన ఆలయాల బాధ్యత ఆయన ఒక్కరే చూసుకోవాల్సిరావడం చాలా ఇబ్బందిగా మారింది. దీంతో చందనోత్సవానికి ముందస్తు ప్రణాళిక నిర్వహణలో ఆయన విఫలమయ్యారు.

అంతరాలయంలోకి వెళ్లేందుకు ప్రోటోకాల్‌, వీఐపీ దర్శన టిక్కెట్లు పరిమితంగానే ఉండాలని సూచించినా.. కలెక్టర్, మరికొందరు అధికారులు మాత్రం వేలసంఖ్యలో జారీచేయడం వల్లే ఆదివారం నాటి గందరగోళానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉత్సవ వేళ రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలే వద్దని పాలకవర్గ సభ్యులు సైతం ఈవోతో చెప్పారు. అయినాసరే అధికారులు అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం చేసిన ప్రయత్నంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. గతంలో వీఐపీ, ప్రొటోకాల్‌ దర్శనాలకు 5 వేల టిక్కెట్లు జారీ చేసేవారు. ఈసారి 6వేల వరకు ఇస్తామని చెప్పి ఏకంగా 20 వేలకు పైగానే జారీ చేయడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

2012లో చందనోత్సవంలో కూడా ఇలాగే గందరగోళం నెలకొనగా.. దీనిపై అప్పటి ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ప్రొటోకాల్, వీఐపీలకు కలిపి 5వేల టికెట్లు మాత్రమే జారీచేయాలని.. అందులో వెయ్యి మందిని మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించాలని కమిటీ సూచించింది . 2013 నుంచి దీనిని అమలుచేసినా.. 2017 నుంచి మరింత సంస్కరించారు. కేవలం అనువంశిక ధర్మకర్త కుటుంబీకులు, దేవదాయ మంత్రి, కమిషనర్, టీటీడీ ఛైర్మన్, పీఠాధిపతులకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించేవారు. మిగిలిన వీఐపీలు ఎంతటివారైనా భోగ మండపం వద్ద నుంచే స్వామివారిని దర్శించుకునే వారు. టైమ్‌ స్లాట్‌ పక్కాగా అమలు చేసేవారు.

దీంతో రెండు, మూడు గంటల్లోనే ప్రొటోకాల్, వీఐపీ దర్శనాల హడావుడి ముగిసి, సాధారణ భక్తులు దర్శనాలు చేసుకునే వెసులబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాల టిక్కట్లే వేలాదిగా జారీ చేయడంతోపాటు వీరిలో చాలామందిని అంతరాలయంలోకి అనుమతించడం గందరగోళానికి కారణమైంది. ఆలయం లోపల దేవదాయశాఖ సిబ్బందే విధులు నిర్వహించాలని కమిటీ సూచించినా.. పోలీసులే అన్ని వ్యవహారాలు చక్కబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నాటి కమిటీ సూచించినా.. వీఐపీల దర్శనాలలోనే తరించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020, 2021లలో కొవిడ్‌ కారణంగా చందనోత్సవానికి భక్తులను అనుమతించలేదు. గత ఏడాది తొలిసారిగా చందనోత్సవం నిర్వహించగా.. అప్పుడు కూడా ఇవేరకమైన వైఫల్యాలు కనిపించాయి. సాధారణ భక్తులతోపాటు, 1500, 1,000, 300 టికెట్లు కొనుక్కున్న వారు సైతం స్వామి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోయారు. వీరి సంఖ్య పది వేలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details