DGP on MP Family Kidnap Case: విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌పై సమాచారం అందగానే పోలీసులు స్పందించారని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కిడ్నాప్‌పై ఫిర్యాదు రాకుంటే.. తమకు ఎలా తెలుస్తుందని డీజీపీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. విశాఖలో రౌడీ షీటర్లపై నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. కిడ్నాప్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి త్వరగా నిందితులకు శిక్ష పడేలా చూస్తామని పేర్కొన్నారు. రౌడీషీటర్ హేమంత్పై 30 కేసులు న్నాయని.. నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఆయన తెలిపారు.
ఎంపీ సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి నిందితుల లొకేషన్ ట్రేస్ చేశామని డీజీపీ తెలిపారు. నిందితులు హేమంత్ , రాజేష్, సాయిలను అరెస్ట్ చేశామన్నారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని డీజీపీ తెలిపారు.
ఏడాది కాలంలో 90 కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయిని ధ్వంసం చేశామని.. ప్రస్తుతం ఒడిశా నుంచి రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. వాటిని అరిక్టటేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పత్రికల్లో శాంతి భద్రతలు అదుపులో లేవని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తేల్చిెచెప్పారు. నిందితుడు హేమంత్ ఇటీవల ఓ కిడ్నాప్ కేసులో కీలక సూత్రధారని.. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చారని తెలిపారు. కిడ్నాప్ గురించి ఎవరూ ఫిర్యాదు చేయకపోతే తమకెలా తెలుస్తుందని డీజీపీ మీడియాతో అన్నారు .
సాధారణంగా పోలీసులు రౌడీ షీట్ ఉన్న వారి కదలికలపై నిఘా పెడుతుంటారు. ప్రతి వారం సంబంధిత స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు . మరి ఈ ఘటనలో కీలకమైన హేమంత్ పై రౌడీషీట్ ఉంది. అతనిపై నిఘా పెట్టారా ? పెడితే రెండు రోజులు ఎంపీ కుటుంబ సభ్యులను ఎలా కిడ్నాప్ చేయగలిగారు. బయట నుంచి డబ్బును ఎలా తెప్పించుకోగలిగారు అనే ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు.
ఇదీ జరిగింది: విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ MVV సత్యనారాయణ కుటుంబసభ్యులు జూన్ 13న కిడ్నాప్ అయితే.. జూన్ 15న వెలుగులోకి వచ్చింది. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రెండు రోజులుగా ఫోన్ చేస్తున్నా ఆడిటర్ స్పందించడం లేదని.. తనకేదో అనుమానంగా ఉందని ఎంపీ ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుతో ఆడిటర్‌కు ఫోన్ చేయగా.. తాను శ్రీకాకుళంలో ఉన్నట్లు చెప్తే.. లోకేషన్ మాత్రం విశాఖలోనే చూపించటం వల్ల కిడ్నాప్ నిజమేనని తేలింది. అయితే.. పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న కిడ్నాపర్లు.. ఎంపీ సతీమణి జ్యోతి, కుమారుడు శరత్‌చంద్ర, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావును కారులో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా.. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను వెంబడించి పట్టుకున్నారు.