Devotees Problems: సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. అప్పన్న నిజరూప దర్శనం కోసం బారులుతీరారు. దీంతో కనీస సౌకర్యాలు లేక క్యూలైన్లలో పిల్లలు, వృద్ధులు, మహిళలు.. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు క్యూలైన్‌లో గంటలతరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
కొండపైకి బస్సుల కొరతతో చందనోత్సవ భక్తులు కొండ కింద ఎదురుచూపులు చూస్తున్నారు. సింహగిరి ఘాట్‌రోడ్డులో వాహన రాకపోకలు స్తంభించాయి. బస్సులు నిలిచిపోవడంతో అనేక మంది భక్తుల నడిచి వెళ్తున్నారు. వీఐపీ వాహనాలు భారీగా కొండపైకి చేరుకున్నాయి. దేవస్థానం సిబ్బంది, పోలీసులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణద్వారం నుంచి పోలీసులు దర్శనాలు చేయిస్తున్నారని భక్తుల ఆరోపిస్తున్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బందితో భక్తుల వాగ్వాదానికి దిగారు.
1500 టికెట్ తీసుకున్న భక్తులకు రెండున్నర గంటలకు పైగా సమయం పడుతుంది. క్యూలైన్లలో సుమారు 3 వేల మందికి పైగా రూ.1500 టికెట్ భక్తులు ఉన్నారు. దీంతో అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. ప్రొటోకాల్ ఉన్నా భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. విశాఖ మేయర్..హరివెంకట కుమారిని అధికారులు పట్టించుకోలేదు. ఐఏఎస్ అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. సీనియర్ జడ్జిలు, ఉన్నతాధికారులు సైతం గంటల తరబడి వేచిఉన్నారు.
మంత్రి బొత్సను నిలదీసిన భక్తులు: సింహాచలంలో గాలిగోపురం వద్ద.. మంత్రి బొత్స సత్యనారాయణను భక్తులు నిలదీశారు. మంత్రి బొత్సకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.1500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసినా క్యూలైన్లు కదలట్లేదంటూ.. ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భక్తుల ఇబ్బందులపై దేవదాయశాఖ అధికారులను బొత్స ప్రశ్నించారు. దర్శనానికి ఎందుకు ఆలస్యం అవుతోందని అడిగారు. క్యూలైన్లలో భక్తులను వేగంగా పంపే ఏర్పాట్లు చేయాలన్న తెలిపారు.