విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీకి సమీపంలో ఉన్న తాడి గ్రామాన్ని తరలించాలనే ప్రతిపాదన ఊపందుకుంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని అనేక విధాలుగా మొర పెట్టుకుంటున్నారు. స్వయంగా ప్రజా ప్రతినిధులే ఇప్పుడు ప్రభుత్వంతో ఈ సమస్య పై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
520 కుటుంబాలు..1,800 జనాభా
రాష్ట్ర ఫార్మా రంగ అభివృద్ధికి ప్రభుత్వం పరవాడ వద్ద ప్రత్యేక ఆర్ధిక మండలి నిర్మాణం చేసింది. దేశ విదేశాలకు చెందిన 80కి పైగా ఫార్మా కంపెనీలు ఇక్కడ కొలువు తీరాయి. కానీ వీటి మధ్యనే సుమారు 520 కుటుంబాలు, 1,800 మంది జనాభా ఉన్న తాడి గ్రామం ఉంది. పరిశ్రమలు విస్తరించటం, ఫార్మా ఉత్పత్తులు పెరగటం తాడి గ్రామస్తులకు శాపంలా మారింది. ఇక్కడ భూగర్భ జలాలు కలుషితమైయ్యాయి. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. అందుకే గ్రామస్థులు తమకు వేరేచోట గూడు చూడాలని కోరుకున్నారు. స్వయంగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదీప్ రాజా ప్రభుత్వానికి, పరిశ్రమల శాఖకు వినతి పత్రం ఇచ్చి గ్రామాన్ని తరలించాలని కోరుతున్నారు.