Dating App Frauds : హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి (25)కి తెలుగు డేటింగ్‌యాప్ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఓ రోజు వీడియో కాల్ చేసిన ఆమె.. దుస్తుల్లేకుండా కనిపిస్తూ.. యువకుడిని కూడా అలా చేయమని ప్రేరేపించి మొత్తం రికార్డు చేసింది. తర్వాత ఈ వీడియోను అందరికీ పంపుతానని బెదిరిస్తూ దఫదఫాలుగా ఆమె రూ.98,400 వసూలు చేసింది. బెదిరింపులు ఆగకపోవడంతో ఆ యువకుడు రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించాడు.
పద్మారావునగర్‌కు చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి కూడా ఇదేరీతిలో రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. డేటింగ్యాప్లో పరిచయమైన యువతితో అసభ్యకర సంభాషణ చేశాడు. దాన్నంతా రికార్డు చేసిన ఆమె అడిగినంతా ఇవ్వకపోతే ఆ సంభాషణలన్నీ సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించి డబ్బులు వసూలు చేసింది. డేటింగ్‌యాప్‌ల ‘ఆకర్షణ’లో పడి ఇలా మోసపోతున్న ఉదంతాలు రాష్ట్రంలో పలుచోట్ల చోటుచేసుకుంటున్నాయి.
ఒక ఆకర్షించే ఫొటో.. నాలుగు ఆకట్టుకునే మాటలు.. నిలువునా ముంచేస్తున్నాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా డబ్బులు దోచేయడమే కాకుండా.. ఒక్కోసారి ప్రాణాలనూ హరిస్తున్నాయి. ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని డేటింగ్‌యాప్‌ల మాటున సాగుతున్న ఈ సాంకేతిక దందా ఇప్పుడు తీవ్ర ‘సామాజిక’ సమస్యగా మారింది. స్నేహం ముసుగులో పుట్టుకొస్తున్న డేటింగ్యాప్లు యువతకే కాదు.. వయసు మళ్లిన వారినీ ప్రమాదంలో పడవేస్తున్నాయి. దిల్లీలో.. ఇదే తరహా యాప్ ద్వారా పరిచయం అయిన శ్రద్ధావాకర్ అనే యువతిని హత్య చేసి, ముక్కలుగా కోసిన అఫ్తాబ్ ఉదంతం ఇప్పడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
స్నేహం ముసుగులో మోసం..!ఒకప్పుడు కలంస్నేహం పేరుతో పరిచయం లేనివారి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. తమ అలవాట్లు, అభిరుచులు పంచుకునేవారు. కాలక్రమంలో అది మరుగున పడింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మళ్లీ ఈతరహా స్నేహాలు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాల ద్వారా కొత్త వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడుతోంది. ఇది ఇంకాస్త ముందుకు వెళ్లి డేటింగ్‌యాప్‌లకు దారితీసింది. వీటిలో ఎవరైనా సభ్యత్వం పొందవచ్చు. తమ వయసు, ఆదాయం, అభిరుచులు, అలవాట్లు వంటివి నమోదు చేయగానే ప్రొఫైల్ సిద్ధమవుతుంది. అప్పటికే ఆ యాప్‌లో నమోదయిన వారికి ఈ వివరాలన్నీ కనిపిస్తాయి. వీటిని ఇష్టపడినవారు వ్యక్తిగతంగా యాప్ ద్వారానే సందేశం ఇవ్వవచ్చు. ఇద్దరూ స్నేహం చేసుకునేందుకు ఇష్టపడే పక్షంలో చాటింగ్ చేసుకోవడం, ఫోన్లో మాట్లాడుకోవడం, తర్వాత వ్యక్తిగతంగా కలుసుకోవడం చేయవచ్చు. స్థూలంగా డేటింగ్‌యాప్‌ల పనితీరు ఇదే.
కొత్త వ్యక్తులతో పరిచయం అనే ఆలోచనే చాలా మందిలో ఆసక్తి రేపుతుంది. యువతీ యువకులు పరస్పరం స్నేహం చేయడానికి వీటిని ఆశ్రయిస్తున్నారు. వీటి ద్వారా జరిగే నిజమైన స్నేహాలు పదుల సంఖ్యలో కూడా ఉండవు. ఎదుటి వారిలో ఉండే ఆసక్తిని ఆసరాగా చేసుకొని నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మారు పేర్లు, తప్పుడు ఫొటోలు పెట్టి బోల్తా కొట్టిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఈ పరిచయం దోపిడీ, అత్యాచారం, హత్యల వరకూ వెళుతోంది. కేవలం ఇలాంటి దారుణాలకు పాల్పడేందుకే రాజస్థాన్, ఝార్ఖండ్, దిల్లీ వంటి చోట్ల వందల సంఖ్యలో ముఠాలు పని చేస్తున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.
అప్రమత్తతే మందు..