'టిడ్కొ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలు చేయాలి' - విశాఖ జీవీఎంసీ ఎదుట దళిత హక్కుల పోరాట సమితి ఆందోళన
ప్రభుత్వం టిడ్కొ ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీల కోటాను అమలు చేయాలని విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా గాంధీ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి నిరసన ప్రదర్శన నిర్వహించింది.
రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీల కోటాను అమలు చేయాలని.. దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకట్రావు కోరారు. దళిత హక్కుల పోరాట సమితి, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని రాజ్యాంగంలోని 36, 46 ఆర్టికల్స్ సూచిస్తాయని డాక్టర్ బూసి వెంకట్రావు స్పష్టం చేశారు. టిడ్కో రుణంలో సబ్ ప్లాన్ నిధులు నుంచి 50 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు. పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. నిర్మాణ వ్యయం మూడున్నర లక్షలకు పెంచాలని ఆయన కోరారు. రాష్ట్రంలో నిర్మించిన రెండు లక్షల 60 వేల ఇళ్లలో ఎస్సీలకు 41,000 ఎస్టీలకు 18000 కేటాయించాల్సి ఉందని వివరించారు.