లాక్‌డౌన్‌లో సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో రెచ్చిపోతున్నారు. ప్రజలకున్న కరోనా భయాన్ని ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. దిల్లీ కేంద్రంగా జరుగుతున్న ఈ హైటెక్ దందా విజయవాడలో వెలుగుచూసింది.
మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్-95 మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చాలాచోట్ల అసలు లభ్యతే లేదు. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన ఇచ్చారు. తక్కువ ధరకే ఎన్-95 మాస్క్‌లు అందజేస్తామనేది ఆ ప్రకటన సారాంశం. ఇది చూసిన విజయవాడకు చెందిన కొంతమంది వైద్యులు ప్రకటనలోని నెంబర్‌కు ఫోన్ చేశారు. అడ్వాన్స్‌గా కొంత నగదు చెల్లించాలని, సరకు డెలివరీ అయ్యాక మిగిలిన సొమ్ము చెల్లించాలని నిందితులు చెప్పారు. దీంతో విడతలవారీగా మూడు లక్షల రూపాయలను నిందితుల ఖాతాలో వైద్యులు జమ చేశారు. రోజులు గడిచినా మాస్క్‌లు రాకపోవటంతో దిల్లీలోని సదరు అడ్రస్‌కు వెళ్లిన వైద్యునికి అక్కడా ఎవరూ కనిపించలేదు. విజయవాడకు వచ్చిన వెంటనే తమకు జరిగిన మోసంపై మాచవరంలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల ఖాతాను ఫ్రీజ్ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటువంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యసేతు యాప్ ద్వారానే సమాచారం తెలుసుకోవాలని పోలీసులు సూచించారు.