నాగ్‌పూర్‌కు చెందిన ఎస్.బి.సుబ్రహ్మణ్యం విశాఖలో లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయారు. తిరుగు ప్రయాణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి సంయుక్త కలెక్టర్ శివశంకర్ ఫోన్ నెంబరుకు ఈ నెల ఒకటో తేదీన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆ తరవాత కొద్దిసేపటికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనని చెప్పాడు. విషయం చెప్పాలని కోరాడు. తనకు నాగ్‌పూర్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని సుబ్రహ్మణ్యం కోరారు. తాము సెల్ నెంబర్‌కు ఒక లింక్ పంపుతామని ఆ లింక్ ని క్లిక్ చేస్తే.. ఒక దరఖాస్తు వస్తుందని దాన్ని పూర్తి చేయాలని అవతలి వ్యక్తి సూచించారు.
ఆ తరువాత ఫోన్ నెంబరుకు లింక్ రావడంతో ఆయన దాన్ని నొక్కారు. ఎలాంటి దరఖాస్తు రాకపోగా యాక్సిస్ బ్యాంక్‌లో ఖాతా ప్రారంభించినట్లు ఒక ఎస్.ఎం.ఎస్. వచ్చింది. అనుమానంతో ఆయన బ్యాంకు ఖాతాను తనిఖీ చేశారు. రెండు సార్లు 5వేలు, ఒకసారి 2500 రూపాయలు ఆయన ఖాతా నుంచి వేరే ఖాతాకు బదిలీ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన సుబ్రహ్మణ్యం... విశాఖ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.