Murder case: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ సమత వసతి గృహం వెనుక ఈ నెల 16న జరిగిన హత్య కేసును.. పోలీసులు ఛేదించారు. విశాఖలోని రెవెన్యూ కాలనీకి చెందిన రాజశేఖర్.. ఈ నెల 16న ఏయూ సమత వసతి గృహం వెనుక హత్యకు గురయ్యారు. ఇషాక్ అనే వ్యక్తిపై మృతుడి భార్య అనుమానం వ్యక్తం చేయగా.. పోలీసులు ఆ కోణంలోనే దర్యాప్తు చేపట్టి, కీలక వివరాలు సేకరించి నిందితులను అరెస్ట్ చేశారు.
రాజశేఖర్ ఓ ఫైనాన్స్ సంస్థలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసేవారు. ఆయనకు.. పొరుగున ఉండే షేక్ ఇషాక్‌కు మధ్య ఆర్థికపరమైన లావాదేవీలున్నాయి. వీరిద్దరి మధ్య బ్లాక్ కరెన్సీ వ్యవహారానికి సంబంధించిన లావాదేవీలున్నట్లు పోలీసులు వెల్లడించారు. బ్లాక్ కరెన్సీని ప్రత్యేక ద్రావణాల్లో ముంచితే దాదాపు ఒక రోజు పాటు.. నిజమైన నోట్లలా కన్పిస్తాయని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో రాజశేఖర్, ఇషాక్‌కు మధ్య విభేదాలు తలెత్తాయని తెలిపారు.