రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
బెజవాడలో..
విజయవాడలోని బీసెంట్ రోడ్డు, వన్‌టౌన్, ఎంజీరోడ్డు,
వైజాగ్..
విశాఖపట్నంలోని జగదాంబ, పూర్ణమార్కెట్,
గుంటూరులో..
గుంటూరులోని పట్నంబజారు, బ్రాడీపేట, అరండల్‌పేట,
ఆ కాలంలో మార్కెట్లు, కూడళ్లలో జనసందోహం.. కానరాని భౌతికదూరం - AP Corona latest News
మార్కెట్లు, కూడళ్లు, ప్రధాన రహదారులు.. ఎక్కడ చూసినా జనసందోహమే. ఎక్కడా కానరాని భౌతికదూరం. కొవిడ్ నిబంధనలు ఎవరికీ పట్టని వైనం. రాష్ట్రంలో ఓ వైపు కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా కొందరు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నిరకాల కార్యకలాపాలు నిర్వహించేందుకు వెసులుబాటు ఉండటంతో ఆ సమయంలో సాధారణ రోజుల తరహాలోనే రద్దీ, జనసంచారం కనిపిస్తోంది.
కర్నూలులో..
కర్నూలులోని రాజ్‌విహార్ కూడలి, వన్‌టౌన్ తదితర ప్రాంతాల్లో జనాల రద్దీ ఏ మాత్రం తగ్గట్లేదు.
చిన్న పట్టణాల్లోనూ పాన్‌షాప్‌లు, టీ కొట్లు, సెలూన్ల వద్ద పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గుమికూడుతున్నవారూ అధికంగానే ఉంటున్నారు. ఈ సమయంలో రోడ్లపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. రోజంతా చేయాల్సిన పనులన్నీ ఆ కొద్ది సమయంలోనే పూర్తి చేసేందుకు ఎగబడుతున్నారు. అవసరం లేకపోయినా కొందరు కావాలనే బయటకు వస్తున్నారు. వీరిలో కొందరు మాస్కు ధరించినా గడ్డంపైకి దించేస్తున్నారు. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మాస్కు తీసేస్తున్నారు. ఈ చర్యలన్నీ కొవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నాయి. గతేడాది లాక్‌డౌన్ వేళ రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఈసారి ఆ తరహా నియంత్రణ కొరవడింది.
ఆంక్షలు ఉన్నా.. ఆగని జోరు
కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన 18 గంటల కర్ఫ్యూ చాలాచోట్ల సరిగ్గా అమలు కావడం లేదు. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు విధించినప్పటికీ.. కొన్ని రంగాల వారికి, వైద్యపరమైన అత్యవసరాలకు మినహాయించింది. ఇది కచ్చితంగా అమలైతే మధ్యాహ్నం తర్వాత రోడ్లన్నీ బోసిపోయి కనిపించాలి. కానీ విజయవాడ ఎంజీ రోడ్డులో మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రి వరకూ వాహనాల రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. అక్కడక్కడ యువత గుంపులుగా తిరుగుతున్నారు. కూడళ్లలో ఆగి కబుర్లు చెప్పుకొంటున్నారు. చిన్నచిన్న సాకులతో బయటకు వచ్చి, వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. విశాఖపట్నం, గుంటూరు తదితర నగరాల్లోనూ ఇదే పరిస్థితి.
చూసీచూడనట్లుగా పోలీసులు
మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి.. నిలువరించాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో అవసరార్థుల కంటే.. కావాలని బయటకు వస్తున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి వారిని అక్కడక్కడ పోలీసులు గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఇది పకడ్బందీగా సాగట్లేదు. మధ్యాహ్నం 12.30 తర్వాత గంట, గంటన్నర పాటు కర్ఫ్యూ కట్టడిగా అమలవుతుంది. అదీ ప్రధాన కూడళ్లలోనే. ఆ తర్వాత సడలిపోతోంది. అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని వాకబు చేయడం లేదు. ఇదే అదునుగా చక్కర్లు కొడుతున్న వారు కొవిడ్ వాహకాలుగా మారుతున్నారు.
ఇవీ చూడండి :కుటుంబాల్లో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురేసి మృత్యువాత