లక్కబొమ్మల పేరు చెప్పగానే ఏటికొప్పాక గ్రామం గుర్తొస్తుంది. 200 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ కళాకారులు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. పూర్వం రాజులకు మాత్రమే పరిమితమైన ఈ బొమ్మలు కాలక్రమంలో అన్నివర్గాల వారికి అందుబాటులోకి వచ్చాయి. గ్రామంలో 200 కుటుంబాలకు పైగా ఈ వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్నారు. మొదట్లో వీరు పిల్లలు ఆడుకునే బొమ్మలు, బొట్టు భరిణలు, పెళ్లికుమార్తె అలంకరణ సామగ్రి వంటివి మాత్రమే తయారుచేసేవారు. యవ కళాకారులు ఈ రంగంలో అడుగుపెట్టాక పెన్, పెన్‌డ్రైవ్, యుద్ధ విమానాలు, దేవుడి బొమ్మలు, చేతిగాజులు, చెవిదుద్దులు, సిగపిన్నులు, బీరు మగ్గులు, చేతివాచీలు, పూజామందిరంలో అవసరమైన సామగ్రి.. ఇలా అన్నిరకాల వస్తువులను తయారుచేస్తున్నారు.
బొమ్మలతో ప్రారంభమైన ఈ కళ ఇంటిలో వాడుకునే అన్ని వస్తువుల తయారీ వరకూ విస్తరించింది. వివాహ వేడుకలను కళ్లకు కట్టినట్టుగా కొంతమంది కళాకారులు తయారుచేసిన బొమ్మలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఇటీవల ప్రధాని మోదీని సైతం ఈ బొమ్మలు ఆకర్షించాయి. ఆయన ఇక్కడి కళాకారులతో మాట్లాడి వీరు తయారు చేసిన బొమ్మలను చూశారు. కళాకారుల కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ బొమ్మలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. గ్రామంలో ఈ బొమ్మలు విక్రయించే షోరూంలు ఏర్పడ్డాయి. ఈ బొమ్మల కారణంగా గ్రామం పర్యాటక కేంద్రంగానూ మారింది. దేశ నలుమూలల నుంచి బొమ్మల తయారీని వీక్షించడానికి పర్యటకులు వస్తుంటారు.
అంకుడు కర్రతో తయారు చేసిన పెన్ను
బొమ్మల తయారీలో ఇక్కడి కళాకారులు ఆధునిక పరికరాలను వాడుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతి సిద్ధమైన రంగులను వాడుతూ ప్రపంచ దేశాలను ఆకర్షించారు. విదేశాలకు బొమ్మలు ఎగుమతి అయ్యే విధంగా రంగుల వాడకంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇక్కడి యువ కళాకారులు తొమ్మిది మంది జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ కళకు ప్రధాన ముడిసరకు అంకుడు కర్ర కొరత వీరిని వేధిస్తోంది. లక్కబొమ్మల తయారీకి అంకుడు కర్ర తప్ప మరేదీ పనికి రాదు. ఈ కర్ర స్థానికంగా అందుబాటులో లేక దూరప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో ఒక మోపు కర్రలు రూ. 500 నుంచి రూ.1000కి పెరిగిపోయాయి. లక్క కేజీ రూ.300 నుంచి రూ.1000కి చేరుకుంది. కరోనా కాలంలో ఈ కళాకారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్యటకులు రాక, బొమ్మలు కొనేవారులేక, ఎగుమతులు నిలిచిపోయి ఆర్థికంగా అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుని బొమ్మల తయారీని ముమ్మరం చేశారు.
కరోనాతో ఉపాధి దెబ్బతింది