CPM Bike Rally Against Steel Plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. సీపీఎం పార్టీ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతోంది. ఇందులో భాగంగా ఈనెల 20 నుంచి అక్టోబర్ 5 వరకు ఉక్కు రక్షణ - ఉత్తరాంధ్ర బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. బైక్ యాత్ర ఇవాళ స్టీల్‌ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్‌కు చేరుకుంది. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయని సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
అప్పుడు హడావుడి.. ఇప్పుడు మౌనం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ తీరు
కాగా.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో మరో ఆలోచనే లేదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖలోని ప్లాంటు ఆస్తుల అమ్మకానికి పచ్చజెండా ఊపింది. నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన భూములు అమ్మగా వచ్చే సొమ్ముతో నిర్వాసితుల సమస్యలు తీర్చాలన్న డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ప్లాంటులో మిగులు భూములను సైతం నిర్వాసితులకు కేటాయించాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమ గోడును ఆలకించకపోవటంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. సీపీఎం పార్టీ వివిధ రూపాల్లో నిరసన తెలుపుతోంది.
Visakha Steel Plant Decided to Lease Land: విశాఖ ఉక్కు భూముల కోసం కార్పొరేట్ వార్.. మళ్లీ అదానీ చేతుల్లోకేనా..!
విశాఖ ఉక్కు కర్మాగారానికి భూములు త్యాగం చేసిన నిర్వాసితుల కుటుంబాల్లో.. మూడో తరం వచ్చినా నేటికి పరిహారం చేతికందలేదు. ప్లాంటు కోసం సిద్ధేశ్వరం, నెల్లిముక్కు, నడుపూరు, దిబ్బపాలెం, గంగవరం, కణితి, అప్పికొండ, కొండయ్యవలస, వడ్లపూడి పంచాయతీల పరిధిలోని 64 గ్రామాల్లో 22 వేల ఎకరాల భూమి సేకరించారు. ఈ క్రమంలో నిర్వాసితుల ఆందోళనలతో వరి పొలాలకు 20వేల రూపాయలు, మెరకకు రూ.17 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఈ పరిహారాన్ని లోక్ అదాలత్ సమక్షంలో అందజేయగా.. కొందరు రైతులు మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇలా 12వేల 680 ఎకరాలకు సంబంధించిన 17.08 కోట్లు రాష్ట్రపతి పేరుతో లోక్ అదాలత్‌లో అలాగే ఉండిపోయింది. గ్రామ సభలు పెట్టి రైతుల వారసులు, యాజమాన్య హక్కు ఉన్న వారికి పరిహారం ఇవ్వాలని 2021 మార్చి 20న న్యాయస్థానం ఆదేశించినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.
నేడే విశాఖ ఉక్కు కార్మికులు మహా గర్జన.. తగ్గేదేలే అంటున్న కేంద్రం
నిర్వాసితులకు ఉద్యోగ నియామకాల్లో 50 శాతం కోటా ఇవ్వాలన్న కేంద్రం ఉత్తర్వుల అమలు.. స్టీల్ ప్లాంటులో మొక్కుబడిగా జరుగుతోంది. నిర్వాసితులకు 'ఆర్-కార్డు మంజూరు చేసి.. ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న హామీ అమలు కావడం లేదు. స్టీలు ప్లాంటుసబ్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలో 15వేల 475 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 8,009 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు. ఈ సమస్యల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ నిరసన చేపట్టింది. ఈ రోజు స్టీల్‌ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్‌కు వారి బైక్ యాత్ర చేరుకుంది.
"స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలి. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడంతోపాటు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గే వరకు పోరాడుతూనే ఉంటాము." - లోకనాథం, సీపీఎం నేత