CPI State Secretary Ramakrishna : స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మే 3 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. విశాఖలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉక్కు పరిరక్షణ పోరాటం నేటికి 808 రోజుకు చేరుకుందని వెల్లడించారు. ప్రైవేటు ఉక్కు పరిశ్రమలకు ఐరన్ ఓర్ మైన్స్ కేటాయిస్తున్నపుడు.. ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వడానికి అడ్డంకులు ఏమిటని రామకృష్ణ ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వర్కింగ్ కేపిటల్, కేపిటివ్ మైన్స్ ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని అన్నారు. స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకూ 50 వేల కోట్ల రూపాయలు వివిధ రూపాల్లో ప్రభుత్వానికి చెల్లించిందని తెలిపారు. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన స్టీల్ ప్లాంట్.. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇంటికి రాను.. ఆఫీసుకు పోను అన్నట్లుగా... మే 9 నుంచి "జగనన్న కు చెపుదాం" అనే కొత్త కార్యక్రమాన్ని పెట్టబోతున్నారని, ప్రజలను ఇంటికి రానివ్వను, తాను ఆఫీస్ కు పోను అనే ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని రామకృష్ణ విమర్శించారు. ఇప్పటి వరకూ ఒక అర్జీ తీసుకున్నది లేదు... మీడియా సమావేశం పెట్టలేదు... అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసిన దాఖలాల్లేవని అన్నారు. చెప్పడానికి అవకాశమే ఇవ్వకపోతే ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. జగనన్న మా నమ్మకం అని స్టిక్కర్లు అంటిస్తున్నారని, నీ భవిష్యత్తు ఏంటో నీకే తెలీదు... బెయిల్ మీద వున్నావు... అది రద్దయితే ఏ క్షణంలో ఎక్కడ వుంటావో తెలీదని ముఖ్యమంత్రిని ఉద్దేశించి విమర్శించారు.