కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తూ.. కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. సీపీఐ 95వ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరుతూ విశాఖ సీతమ్మధారలోని అల్లూరి విగ్రహం కూడలి నుంచి ఊరేగింపుగా ఎంఎంటీసీ కాలనీ, హెచ్బీ కాలనీ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ నగర కార్యవర్గ సభ్యుడు మూర్తి.. అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
44 కార్మిక చట్టాలను తుంగలో తొక్కారు: ఏఐటీయూసీ
కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని దోపిడీకి గురి చేస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి. రమణ ఆరోపించారు. కనీస వేతనాలు, పని గంటలు, వారాంతపు సెలవులు, పి ఎఫ్., ఈ ఎస్ ఐ, పింఛన్ వంటి సౌకర్యాలను తీసివేసి రోజుకు 12 గంటలు వరకు కార్మికులు పనిచేసే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.