విశాఖ ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్( విమ్స్)లో మరో దారుణం జరిగింది. కొవిడ్ పాజిటివ్‌తో ఐసోలేషన్ లో చేరిన 79 ఏళ్ల విశ్రాంత పోర్టు ఉద్యోగి అచ్చెన్న అచూకీ లేకుండా పోయింది. తమ తండ్రి కనిపించడం లేదంటూ తనయుడు శ్రీనివాస్ ఆసుపత్రి వర్గాలకు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యం, డైరెక్టర్ పట్టిం చుకోక పోవడం వల్లనే తన తండ్రి మృతి చెందాడని శ్రీనివాస్ ఆరోపించాడు. డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
కొవిడ్ పాజిటివ్ బాధితుడైన అచ్చెన్న ఆగస్టు 1న విమ్స్ లోచేరాడు. పోర్టు ఆసుపత్రిలో ఆ రోజు తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల విమ్స్ కి తీసుకువచ్చి చేర్చారు. ఆగస్టు 5 వరకు ఆయన ఫోన్లో రోజు కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆగస్టు 6 నుంచి ఆయన ఆచూకీ తెలియకుండా పోవడంతో తనయుడు ఆరా తీస్తూ వచ్చారు. ఇక్కడ కాదు మరో దగ్గర ఉన్నాడని సిబ్బంది నమ్మబలికారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు డైరెక్టర్ సత్యవరప్రసాద్‌ను నేరుగా కలిసి తమ తండ్రి ఆచూకీపై ప్రశ్నించగా... తమకు ఏం తెలుసని ఎదురు ప్రశ్న వేశారు. వృద్ధుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.